19, ఆగస్టు 2009, బుధవారం

ఉక్కు పాదం

అమెరికాలో అతివాదం ,
అప్పుడెప్పుడో తలఎత్తింది !
ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని,
అణిచివేసే ప్రయత్నంలో,
మొహమా టాలు లేవు వారికి,!
షారుక్ ఖానో అబ్దుల్ కలామో
ఎవరైనా ఒకటే మరి!
మొహమాటం తో మెలికలు తిరుగుతూ,
అందరినీ లోనికి వదులుతూ,
ఉగ్రవాదంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం,!
కాలసర్పాన్ని మెడలో వేసుకొని
అక్కడి కఠిన నియమాలు చూసి
గుండెలు బాదుకొంటున్నాం!
కఠినంగా ఉండడం చేతగాక
మీరూ మాలాగే కమ్మని శపిస్తున్నాం!

8, ఆగస్టు 2009, శనివారం

ఉనికి

చెలీ,
నీ చిరునవ్వులు చూసేవరకూ తెలియనే లేదు
వెన్నెలలొ సిరిమల్లెలు వికసిస్తాయని!
నీకన్నుల కదలికను చూసేవరకూ తెలియనేలేదు,
గండు తుమ్మెదలు ఊయలలూగుతాయని!
నీ పెదవుల అరుణిమను గాంచేవరకూ ఎరుకేలేదు ,
కుంకుమ పూరేకులు వెన్నెలను బంధించగలవని!
నీనెన్నడుము ఒంపులను చూసేవరకూ సమఝే లేదు,
గోదవరికి కూడా మెలికలుంటాయని!
నిన్ను చూసేవరకూ నాకు తెలియనేలేదు,
నా బొందెలో ప్రాణముందని,
అందులోఒక గుండె కొట్టుకొంటూందని!.

2, ఆగస్టు 2009, ఆదివారం

పిచ్చి గీతలు
బెడ్డు మీద పడుకొని ఉన్నాడు వాసు.ఇంతకు ముందే డాక్టరు వాసుకు మత్తు ఇంజక్షను ఇచ్చాడు.వాసును చూస్తూంటే నా కళ్లలో నీళ్ళు తిరుగుతున్నాయి.ఇదంతా నాదురదృష్టం కాకపోతేఇంకేమిటి?పదమూడేళ్లు నిండని వాసు కు మతిస్తిమితం తప్పటమేమిటి?
అరఘంట క్రిందట వాసు పరిస్తితి చూసి నా గుండె చెరువై పోయింది.ఎంతమంది పట్టుకొన్నా నిలవటం లేదు. చేతులతో తల బాదు కొంటాడు.జుట్టు పీక్కుంటాడు.పెద్దగా కేకలు పెడతాడు.నిలువు గుడ్లు పడి పోయాయి. కొంతశేపు నవ్వు.అంతలోనే ఏడుపు.కన్న కొడుకును ఇలా చూడటం కంటే నరకం ఏతండ్రికైనా ఇంకేముంటుంది?
నిద్రలో ఎంత ప్రశాంతంగా ఉన్నాడు వాసు!ఎంత తెలివైనవాడు ఎలాగై పోయాడు.వాసునెంతప్రేమగా చూసుకొన్నాము మేము?అన్ని పరీక్షల్లోను ఫస్టున వచ్చేవాడు.నేను ఉద్యోగరీత్యా ఎక్కువగా క్యాంపుల్లో తిరుగుతుంటాను.ఇంట్లో ఉన్నప్పుడు వాసు జ్యోతులే నాకు ప్రపంచం.జ్యోతికి ఎనిమిదేళ్లు.సమీర కూడా ఇద్దరుపిల్లలనూ ఎంతో క్రమశిక్శ్ణతో పెంచింది.సమీర సహకారమే లేకపోతే పిల్లలు నాఆశయాలకు తగ్గట్టుగా పెరిగే వారా? అందమైన భార్య ముచ్చటైన పిల్లలుచక్కని సంసారం తలచుకొని నేనప్పుడప్పుడూ గర్విస్తుంటాను కూడా.హాయిగా బ్రతుకుతున్న మమ్ము చూసి కన్ను కుట్టిందేమో ఆ భగవంతుడికి.అందుకే వాసునిలా చేశాడు.

మరో మూడు ఘంటలవరకూ స్పృహ రాదని చెప్పాడు డాక్టర్.ఈలోగా సమీరను చూశి రావాలి.మగాడిని నాకే ఇలాగుంటే ఇక అత్యంత సుకుమారి సమీర ఈపరిస్తితులను తట్టుకో గలదా? ఆమె ధుఃఖానికి అదుపే లేదు.హాస్పిటలు నించీబయటకు నడిచి కన్పించిన ఆటోలో కూలబడ్డాను.
రాత్రంతా నిద్రలేదేమో కళ్ళు మండి పోతున్నాయి.సమీర ఫోనుకాల్తో పూణే నుండీ ఉన్నఫళంగా బయలు దేరాను.ఇక్కడకు వచ్చి వాసు పరిస్తితి చూసి నాహృదయం బ్రద్దలయ్యింది.కానీ వాసు ప్రవర్తన నాకు మూడు నెలల క్రిందటే ఆందోళన కలిగించింది.ఎప్పుడూఏదో ఆలోచిస్తూ కూర్చొనేవాడు.భోజనంకూడా సరిగా చేసేవాడు కాదు.రాత్రి చదువుకోటానికి కూర్చుని నోట్సులో ఏవేవో పిచ్చి గీతలు గీసే వాడు. నేను రెండు మూడు సార్లు కోప్పడ్డానుకూడా! నాకు తెలిసిన ఒకసైక్రియాటిస్ట్ దగ్గర వాసు విషయం చర్చించాను.అతను రెండు రోజులు వాసును జాగ్రత్తగా పరీక్శించి,కొద్దిగా మానసిక బలహీనతకు లోనయ్యాడనీ,క్రమంగా తనే కోలుకొంటాడనీ చెప్పాడు.కొన్ని జాగ్రత్తలు చెప్పి ఏవో మాత్రలు ఇచ్చాడు.వాసు పరిస్తితి ఇంత భయంకరంగా పరిణమిస్తుందని అప్పుడు తెలిసికోలేకపోయాము.
ఆటో ఇంటి ముందాగటంతో ఆలోచనల్లోంచీ బయట బడి ఇంట్లోకి అడుగు పెట్టాను.ఫోనులో ఎవరితోనో మాటాడి అప్పుడేఫోను క్రిందపెడుతూంది సమీర.ఏడ్చి,ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బి ఉన్నాయి.ముఖమంతా ఎర్రగా కందిపోయి ఉంది.జుట్టు రేగి ఎన్నోరోజులుబెడ్డు మీద ఉండి ఇప్పుడేలేచిన రోగిలా నీరసంగా ఉందామె.నన్ను చూడగానే పరుగులాంటి నడకతో ఎదురువచ్చి,"ఎలా ఉన్నాడండీ వాసు?" అంది ఆందోళనగా. "మత్తు ఇంజక్షనిచ్చారు.ఇప్పుడప్పుడే లేవడు.నీవు కొంతసేపయినా విశ్రాంతి తీసుకోలేదా సమీరా?"అన్నాను ఆప్యాయంగా ఆమె జుట్టుసవరిస్తూ.నా గుండెలపై వాలి భోరున ఏడ్చింది సమీర.ఆమె కన్నీళ్ళతో నా షర్టు తడిసి పోయింది.దుఃఖాన్ని కంఠంలో ఎంత నొక్కి పట్టినా నా కళ్ళు సెలఏరులేఅయినాయి.ఆమె జుట్టు తడిసి పోతూంది నాకన్నీటి ధారలతో.ఆమె వీపు నిమురుతూండి పోయాను.అలా యెంతసేపు నిలుచుండి పోయామోతెలియదు.ఎవరిదోదగ్గు విన్పించి ఇద్దరం విడి పోయి గుమ్మం వైపు చూశాము.రాజశేఖర్ నిల్చుని ఉన్నాడు.సమీర లోపలికివెళ్ళి పోయింది.
రాజ శేఖర్ నాప్రాణ మిత్రుడు. నేను ఊర్లోఉన్నప్పుడు మేమిద్దరమూ రోజూ కలుస్తూంటాము.అతను మాకు త్వరలోనే ఫామిలీ ఫ్రెండైపోయాడు.శేఖర్ లోపలకు వచ్చి నా భుజంమీద చేయి వేసి చెప్పాడు
"ఇప్పుడు ఆసుపత్రినుంచే వస్తున్నాను.వాసు నిద్రపోతున్నాడు.డాక్టరుతోమాటాడాను.శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు.ధైర్యంగా ఉండడం కంటే మనం చేయగలిగిందేమీ లేదు"
నాకు శేఖర్ ఆత్మబంధువులా కనిపించాడు. "చాలా థాంక్స్ శేఖర్! మాకు చాలా సహాయంచేస్తున్నావు.సమీర చెప్పింది.ఫోను చెయ్యగానే వచ్చి,వాసూను హాస్పిటల్లో చేర్పించావని.వాసూగోళ్ళు నీ ముఖంపై
బలంగా దిగ బడ్డాయేమో.ఇంకా రక్కులు అలాగే ఉన్నాయి.వాసూ మళ్ళీ మామూలు మనిషౌతాడా!" దీనంగా అడిగాను నేను.నాకు తెల్సు.శేఖర్ దగ్గర ఆప్రశ్నకు సమాధానంలేదుకానీ నాకు ఉప శాంతిని కలిగించేఏదోఒక మాట చెప్తాడేమోనని ఆశ.
"జ్యోతి మాపిల్లల్లో కలిసిపోయింది. మీరు నిశ్చింతగా ఉండవచ్చు" అన్నాడు శేఖర్ మాట మారుస్తూ.కొంతశేపు కూర్చుని వెళ్ళిపోయాడు శేఖర్. సమీర పడగ్గదిలో ఉంది.హాస్పిటలుకు ఫోను చేశాను.
వాసు ఇంకా లేవలేదు.బహుశారాత్రికి లేవకపోవచ్చు. లేవగానే ఫోను చేస్తామని చెప్పారు.టైం చూశాను .రాత్రి పది దాటింది.నిద్ర రావటంలేదు.మనసంతా ఏదోగా ఉంది.పడక గదిలోకెళ్ళాను. సమీరకూడానిద్రపోలేదు.పైకప్పు కేసి చూస్తూంది.కన్నులనుండీ కారిననీరు చెక్కిళ్ళాపై చారలు కట్టింది.నిశ్శబ్ధంగా ఈజీచైర్ లో నడుం వాల్చి తలక్రింద రెండు చేతులూ పెట్టుకొనికళ్ళు మూసికొన్నాను.
వాసు నవ్వుతూ,గెంతుతూ హుషారుగా ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి.
వయసుకు మించిన తెలివితేటలుండేవి వాసుకు.పుస్తకాలు చదవటమంటే ప్రాణం.మమూలుగా అతని ఈడు పిల్లలకు అర్ధంగాని పుస్తకాలు కూడా చదివి అర్ఢం చేసుకొనే వాడు.కానీ వాసు మనసు చాలా సుకుమారం.చిన్నగా కసురుకొన్నా కూడా ఎంతో బాధ పడేవాడు.అందుకే అతనిలో ఏవన్నా తప్పులుంటే చిన్నగా నచ్చ చెప్పటానికి ప్రయత్నించేవారం నేనూ ,సమీరా.
ఇంత ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగిన వాసు ఇలా ఎందుకయ్యాడు? మళ్ళీ మామూలు మనిష వుతాడా? అంతా అగమ్యగోచరంగా వుంది.కళ్ళు తెరిచి చూశాను సమీరవైపు.
ఎప్పటినుంచీ చూస్తూందో తెలీదు,సమీర నావైపే చూస్తూంది."నిద్ర రాలేదా?" ఇద్దరి నోటినుంచీ ఒకే ప్రశ్న వచ్చింది.ఇద్దరికీ తెలుసు నిద్రరాదని.
"సమీరా రాత్రి వాసు అలాప్రవర్తిస్తుంటేనీకు భయం వేయలేదా?అంతమంది నర్సులే పట్టుకోలేకపోయారు.ఒక్కదానివి.ఎలాపట్టుకోగలిగావు"
"నిద్రలోనేలేచి కేకలు మొదలు పెట్టాడు.కళ్ళుఎర్రగా అగ్నిగోళాల్లా వున్నాయి.మంచినీరుయిచ్చాను. నాముఖంమీద విసిరికొట్టాడు.చేతికందినవన్నీ నాపై విసిరేయటం మొదలుపెట్టాడు.ఏంచేయాలో తోచక మీ ఫ్రెండు కు ఫోన్ చేశాను.అతను వచ్చి ఎలాగో వాసును పట్టుకొని ఆటొలో హాస్పిటలుకు తీసికెళ్ళాడు.వెనుకే మరో ఆటోలో నేను వెళ్ళాను.అక్కడి నించీ మీకు ఫోను చేశాము."ఆమె చెప్తూంది పైకప్పుకేసి చూస్తూ.
కాటుక కళ్ళు తడిసి ముద్దయ్యి ఇంకాపెద్దవిగా కన్పిస్తున్నాయి.పసి పిల్లవాడు పాఠంఅప్పగిస్తున్నంత శ్రధ్ధగా చెప్తూందామె. ఏదో అడగబోయాను. ఇంతలోఫోను మ్రోగింది.టైం పన్నెండయ్యింది.
పరుగెత్తికెళ్ళి రిసీవర్ ఎత్తాను.సమీర నావెనుకేవచ్చి నిల్చుంది.హాస్పిటలునించీ.వాసూలేచి మళ్ళీగొడవ మొదలు పెట్టాడట.ఇంటికి తాళంవేసి ఇద్దరం బయలుదేరాం.

************ ****************** *************
మేము హాస్పిటలుకు చేరేసరిరికి రాజశేఖర్ వచ్చివున్నాడు.వెలుపలేమమ్మల్ను కలిశాడు.ప్రస్తుతం సమీర వాసుకు కన్పించటం మంచిది కాదనీ, నన్ను మాత్రమే వెళ్ళి చూడమనీ చెప్పాడు.నేను లోనికెళ్ళి వాసును చూసి నిర్ఘాంతపోయాను.వాసును ఇద్దరు నర్సులు చెరొకరెక్కా పుచ్చుకొని ఉన్నారు.వాసు గుడ్లు పైకెత్తి సీలింగ్ ఫాన్ వైపు చూస్తున్నాడు.నేను కొంచెం దగ్గరకు వెళ్ళాను."వాసూ" పిలిచాను.నావైపుకూడాచూడ లేదు.మళ్ళీపిలిచాను "వాసూ".-లాభంలేదు. వాడి చూపులే మారిపోయాయి.నన్ను గుర్తుపట్టలేదు.ఇంకొంచెందగ్గరకెళ్ళి భుజం పై తట్టాను.--అంతే! చివుక్కున తలతిప్పి నా వైపు చూశాడు.గుడ్లు ఎర్రగా వున్నాయి.నాపై ఎక్కువసేపు చూపు నిలపలేదు. అరుపులూ,కేకలూ మొదలు పెట్టాడు.ఆ ఇద్దరికీ వాసును పట్టుకోవటం కష్టమై పోయింది.డాక్టర్ వచ్చాడు. వాసుకు మళ్ళీ మత్తు ఇవ్వబడింది.డాక్టరు వెనుకే అతని రూములోకి వెళ్ళాను నేను."వాసు కేసును పూర్తిగా స్టడీ చేశాను. మీరిచ్చిన వివరాలను బట్టిచూస్తే అతనికి పిచ్చి ఉన్నట్టుండి ఒక్క రోజులో వచ్చిందికాదు.క్రమ క్రమంగా అతని మనసు బలహీనమౌతూ వచ్చింది.ఎవ్వరికీచెప్పుకోలేని ఏదో సంఘటన అతని మనసుపై సమ్మెట పోటులా పదేపదే తగలటం అతని ప్రస్తుత పరిస్తితికి కారణం కావచ్చు.అతన్ని భాదించిన విషయమేదో ముందు తెలుసుకోవాలి.రేపు వాసును ట్రాన్స్ లోకి తీసికెళ్ళి అతని మనసు లోని నిఘూడమైన విషయాలు బయటకు లాగుదాం.ఆ తర్వాత అతను తప్పక మామూలు మనిషౌతాడు". చెప్పి ముగించాడు డాక్టర్.ఆలోచిస్తున్నాను నేను .వాసు ను అంతగా భాదించిన విషయమేమిటో అర్ధంగావటం లేదు.ఆలోచిస్తూ వెలుపలికి వచ్చాను నేను.సమీర ఒకప్రక్కా ,రాజశేఖరం మరోప్రక్కా నిల్చుని ఎదురు చూస్తున్నారు,నాకోసం. "ఎలా వుందండీ, వాసుకి?" "మళ్ళీ మత్తు ఇంజక్షనిచ్చారు.ఈ లోగా ఇంటికి ఒకసారి వెళ్ళివద్దాం."హాస్పిటలుకు రెండు వీధులవతలే ఇల్లు.తను కొంచెంశేపు అక్కడేఉండి తర్వాత వస్తానంది. రాజశేఖర్ ప్రొద్దున్నే వస్తానని చెప్పి వెళ్ళి పోయాడు.
నేనింటికి బయలు దేరాను.అప్పుడు సమయం, రాత్రి రెండయ్యింది.
ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు.ఏమీ తోచక వాసూ చదువుకునే గదిలోకెళ్ళాను.షెల్ఫులోని పుస్తకాలన్నీ చిందరవందరగా పడివున్నాయి.కుర్చీ లాక్కుని కూర్చుని ఒక్కోనోట్సూ చేతిలోకి తీసుకుని చూడసాగాను.నోట్సులనిండాపిచ్చిగీతలు.ఆగీతల్లోఅర్ధాలు వెతకటానికి ప్రయత్నిస్తున్నాను.ఆ పిచ్చి గీతల మధ్యలో అక్కడక్కడా ఉన్నవంకర టింకర అక్షరాలు నన్నకర్షించాయి.కుదుర్చుకుని చదవటానికి ప్రయత్నిస్తున్నాను.ఒక నోట్సులోఅనేక పిచ్చిగీతల మధ్య గజి బిజి గా ఉన్న అక్షరాలను అతిప్రయత్నం మీద చదవగలిగాను. ’ రాజశేఖర్ ’ శేఖర్ పేరెందుకు రాశాడు వాసు.వీరిద్దరికీ పెద్ద పరిచయంకూడాలేదే.అనుకొంటూ అత్రంగా ఇంకొక పేజీ తిప్పాను. ;సమీర’ ఆశ్చ్ర్యపోయాను. అమ్మ పేరును రాశాడేమిటి? ఇంకొన్ని పేజీలు తిరగేశాను. ’నాన్న--’
ఆనోట్సులో మరేగీతలూలేవు. మరోనోట్సు తీసికొన్నాను.
ఒక పేజీలో --------రాజశేఖర్-సమీర
మరోపేజీలో---------నాన్న---ఎలా---
ఇంకోపేజీలో---------రాత్రి---
పరిశీలనగా చూస్తేతప్ప ఈఅక్షరాలు ఒక పట్టాన బయట పడవు.అక్షరాలు కుదుర్చుకొన్నాను. భావమే భోదపడటంలేదు. బయట ఆటో ఆగింది.సమీరదిగి నేరుగా తన రూములోకెల్లిపోయింది.కిటీకీలోంచీ తోటలోకి చూస్తూ ఆలోచిస్తున్నాను.బయట వర్శం మొదులయ్యింది.
మబ్బులు విడిపోతున్నాయి. ఇప్పుడిప్పుడె భావం ప్రస్ఫుటమౌతూంది.ఎక్కడో తొలికోడి కూశింది. లైటు వెల్తురులో తోట అస్పష్టంగా కన్పిస్తూంది.నా ఆలోచనలు ఒక ఆఆకృతిదాలుస్తున్నాయ్. తోట లో ఏదో అలికిడయ్యింది.పడకగదివైపు నడిచాను.సమీర ప్రశాంతంగా నిద్ర పోతూంది.హాలులోకెళ్ళి ఫోనుప్రక్కన సోఫాలో కూలబడ్డాను.కళ్ళు మం డి పోతున్నయ్.హ్రుదయం మరిగి పోతూంది. ’రాజశేఖర్-సమీర --రాత్రి--నాన్న ఎలా--’ సమన్వయం కుదిరింది.భావం భోదపడింది.ఫోన్ వైపు చూస్తూ కూర్చున్నాను.
తెల్లవారిపోయింది. ఫోన్ మ్రోగలేదు. పడ్గ్గదిలోకివెళ్ళి చూశాను. సమీర యింకానిద్రలేవలేదు. కిటీకీలోంచీ తోటలోకిచూస్తూ నిల్చున్నాను.ఏదో తళుక్కున మెరిశింది.వెళ్ళి చూశాను. స్లీపింగ్ పిల్ల్స్ బాటిల్.ఖాళీగా ఉంది. రూములోకి పరుగెత్తాను.సమీర ముక్కువద్ద చెయ్యి పెట్టి చూశాను. ఇంకా ప్రాణ ముంది. దిండు కిందనుంచి సగం కన్పిస్తున్న కాగితం మీదపడింది నా దృష్టి.ఉత్తరం .ఇప్పిడు చదివేసమయం లేదు.జేబులోకుక్కుకొని సమీరను చేతులలోకి తీసికొని హాస్పిటలుకు పరుగెత్తాను.’డోసు బాగా యెక్కువయ్యింది,ప్రయత్నిస్తా’మన్నారు డాక్టర్లు.
బయట బెంచీ మిద కూర్చుని ఉత్తరం బయటకు తీశాను. ’క్షమించండి. వాసు ప్రస్తుత పరిస్తితికి పూర్తిగా భాద్యత నాదే.నాప్రవర్తనే వాడిని పిచ్చివాడిని చేశింది.మీరు రాజశేఖర్ నాకు పరిచయంచేసిన దురదృష్ట క్షణాన్నే నాజీవితంమీకు తెలియని మలుపు తిరిగింది.మీరు క్యాంపుకెళ్ళినప్పుడు అతను తరచూ వచ్చేవాడు.మీకు అన్యాయంచేస్తున్నాననే భావం నా అంతరాత్మను కృంగదీస్తున్నా అతని ఆకర్షణ నించీ బయట బడ లేక పోయాను.ఓరోజు వాసు స్కూలునించీవచ్చేసరికి నేను శేఖర్ చేతుల్లో ఉన్నాను. ఆరోజే వాసుకు చెప్పాను, శేఖర్ యిక్కడకు వస్తున్నవిషయం నాన్నకు చెప్ప్వద్దనీ అలాచెప్తే చాలా సమశ్యలొస్తాయనీను.నన్ను క్షమించండి,వాడికి మీరంటే ప్రాణం.నేను సరిగ్గా వాడి ఆబలహీనతను సొమ్ము చేసుకొన్నాను.మీతో చెప్తే మీ ప్రాణాలకు ప్రమాదమని చెప్పాను.మాచేష్టలు వాసు హ్రుదయంపై,ఇంతబలంగా పని చేస్తున్నాయని గ్రహించలేకపోయాను.
వాసును హాస్పిటలులో చేర్చినరోజున నేను ఫోను చేస్తే అతను రాలేదు.ఆసమయంలో అతను ఇక్కడే ఉన్నాడు. కన్నకొడుకు పతనానికి కారణ మయ్యాను.నమ్మిన మీకు ద్రోహం చేశాను. నేను బ్రతుకును కొనసాగించటానికి అనర్హురాలిని. ’
డాక్టర్ బయటకు వచ్చి ’యువార్ లకీ సర్ షి ఈజ్ అవుటాఫ్ డేంజర్’ అని చెప్పాడు.చిన్నగానవ్వుకొన్నాను.నాబిడ్డలు ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతున్నారనుకొన్నాను.జరిగిండేమిటి?
ఇంటికి వచ్చాను.శేఖర్ కు ఫోన్ చేశాను. "సమీర నిద్రమాత్రలు మ్రింగింది.ప్రమాదంలేదు.హాస్పిటల్లో ఉంది. చూసుకో.జ్యోతిని తెచ్చి వదిలి పెట్టు." నామాటలు పొడి గాఉన్నాయి.నాకంఠంలో ఏవిధమైన ఉద్వేగమూ లేకుండా ఎలా మాటాడ గలిగాను-ప్రియ స్నేహితుడితో!
మరో అరఘంటలో వెలుపల బైకు ఆగిన చప్పుడయ్యింది.జ్యోతి నడిచి వస్తూంది. దూరమౌతున్న బైకు చప్పుడు వింటున్నాను నేను-------


ఠ్

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు జాబితా

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    10 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!