23, ఫిబ్రవరి 2010, మంగళవారం

నేనెందుకిలా..........7

మనిషికి ఆరోగ్యం సరిగాలేనప్పుడు ప్రేమ కురిపించే మనసులు పైన వ్రాల్తాయంటారు.నిజమేనేమో అన్పించింది నాకు  శివాను చూస్తుంటే . వాడు నాకు బాగాలేనప్పటి నుండి నామంచం వదలనే లేదు.అన్నీ మంచం మీదికే సప్లయి చేసేవాడు.ఎప్పుడూ నాతొపోట్లాడే వీడికి నామీద ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్య పోయాను నేను..వాడు నా కాళ్ళవద్ద కూర్చొని కాళ్ళు పిసుకుతూ ఉంటేనా కన్నులు చెమర్చాయి ."చాలు శివా! నీవు వెళ్లి ఆడుకో పో !' అన్నాను.ప్రేమానురాగాలు ఇంత తియ్యగా ఉంటాయని ,వాటిని మనపై కురిపించే అమృత మనస్కులు మన చుట్టూ ఉన్నంత వరకు మనకు ఈ ప్రపంచం ఒక నందనో ధ్యానవనంలా  ,రంగులహరివిల్లులా కన్పిస్తుందని,అప్పుడే నేను తెలుసుకొన్నాను.
క్రమంగా కోలుకొన్న నేను రెండు రోజుల తర్వాతస్కూలుకు వెళ్ళగలిగాను. అక్కడ నిశ్చలను చూసిన నా మనసు ,మళ్లీ భారమయ్యింది .ఆరోజంతా క్లాసులతో బిజిగా ఉండి దాంతో మాట్లాడడమే కుదరలేదు .సాయంత్రం గేమ్సు టిచరు రాకపోవటంతోఅందరు ఎవరి పాటికి వాళ్ళు ఆడుకోసాగారు.నేను నిశ్చల దూరంగా పచ్చికలో కూర్చున్నాము .నేను  మవునంగా ఉన్నాను.
నిశ్చలే మొదలు పెట్టింది.
"ఆమె మా అమ్మ!"  తెలుసన్నట్లు  తల ఆడించాను.
"నీవు పుట్టినప్పటి నుండి మీ అమ్మ ఇలాగె ఉందా?"
"లేదు బృందా! నాకు ఆరేళ్ళు వయసు వచ్చే వరకు బాగానే ఉంది .నేనంటే ఎంత ప్రేమో అమ్మకు!. ప్రతి పండుగకు నాకు బట్టలుకొనేది.రోజు నాకు రకరకాల షోకులు చేసి నన్ను చూసికొని మురిసిపోయ్యేది.నేనేదడిగితే అది క్షణాల్లో అమర్చేది.లోకంలో అమ్మలందరూ ఎలాఉంటారో నాకు తెలీదు కానీ ఒక జీవితకాలానికి సరిపడా అమ్మప్రేమను ఆరేళ్ళకే నేను అమ్మవద్ద పొందగలిగాను.భగవంతుడికే కన్ను  కుట్టిందేమో ,అమ్మను అలాచేసాడు.
"మరి ఎలా?"
దాని ముఖం రక్త వర్ణం లోకి మారింది.  "మా నాన్న వల్లే...?"
నిర్ఘాంత పోవటం నా వంతయ్యింది.
"" అవును బృందా! ఆనందంగా సాగిపోతున్న మా కుటుంబం నాన్న చేసిన పనివల్ల చిన్నా భిన్నమయ్యింది.వాళ్ళ ఆఫీసులో టైపిస్టును పెళ్ళిచేసుకొని ఏకంగా ఇంటికి తీసుకొని వచ్చేశాడు నాన్న.విషయంతెల్సుకొన్న అమ్మ నివ్వెర పోయింది.నాన్ననూ ఆమెనూ అలాగే చూస్తూండి పోయింది చాలాసేపు. స్వతహాగా మా అమ్మ చాలా సాధు స్వభావు రాలు.అటువంటి అమ్మ ఆ రో జు అగ్ని పర్వతమే అయ్యింది.నాన్న నూ ఆమెనీ పట్టుకొని చేతులు నెప్పి పుట్టేవరకూ కొట్టింది.-ఏడ్చి ఏడ్చి, ఆమె శరీరంలోని రక్తమంతా నీరై పోయింది.   నీరసపడిపోయిన అమ్మ స్పృహ కోల్పోయింది.ఆదురదృష్టకరమైనరోజు నాకింకా బాగా గుర్తుంది.మాకుటుంబంలోని సంతోషాన్నీ,ఆనందాన్నీ నిర్ధాక్షిన్యంగా తనతో తీ సుకొని పోయిన రోజది.ఆరోజు తర్వాత మాయింట్లో నవ్వులు మాయమయ్యాయి.నాన్న కూడా సంతోషంగా ఉన్న క్షణాలు నాకు గుర్తులేవు.ఇలా ఎందుకుజరిగింది బృందా? తిరిగిలేచిన అమ్మ మామూలుగా లేదు.పిచ్చిచూపులు చూస్తూంది.ఎవ్వరినీ గుర్తించలేదు.నన్ను కూడా..."
 నిశ్చల మనసు చలించింది.కళ్ళలో నీళ్ళు చిమ్మాయి.కొంచెంసేపు మౌనంగా కూర్చుంది. తర్వాత చెప్పసాగింది...
 "పిన్ని నాన్నతో చెప్పింది.’నేను పెళ్ళి చేసుకొని వచ్చింది,సంతోషంగా ఉండడానికి.అంతేగానీపిచ్చివాళ్ళకు సేవలు చేయటానికి కాదు.ఆమె విషయం మీ రేంచేసుకొంటారో నాకు తెలీదు."అంటూ కుండ బ్రద్దలు కొట్టింది.అమ్మను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని చూశాడు నాన్న.కానీ నేనందుకు ఒప్పుకోలేదు.అమ్మను నేనే చూసుకొంటానని మాట ఇచ్చాను..........

నిశ్చల ఇంటికివెళ్ళి వచ్చిన తర్వాత నా ఆలోచనాపధంలో స్వచ్చమైన మార్పు వచ్చింది.నాకు తెలిసినజీవితం చాలా చిన్నది, సుఖమయమైనది.  కానీ ఇది శాశ్వతం కాదు.
ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విషాదం దాగి ఉంటుందేమో! అలాగేనా జీవితంలో కూడా విషాదం దాగి ఉందా?ఒకప్పుడు సంతోషంగా ఉన్న నిశ్చల ఈరోజు ఇంత విషాద భారాన్ని మోస్తూందంటే,ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖ ధుఖాలు కల్సి ఉంటాయా? నా జీవితంలోకూడానా?.....నా చిన్ని బుర్ర ఆలోచనలతో వేడెక్కి పోతూంది. కానీ ఒక్కటి మటుకూ స్పష్టమయ్యింది.--నేననుభవిస్తున్న ఈ సంతోషం,ఆనందం శాశ్వతం గాదు.ఒక పెను విషాదం పొంచిఉంది.
అది ఏ రూపంలో నాపై దాడి చేస్తుందో తెలీదు.  మరికొద్ది రోజుల తర్వాతగానీ నా ఆలోచనలకుఒక రూపం రాలేదు.జీవితంలోని మరోకోణాన్ని నేను సింధుజా వాళ్ళింట్లో చూడగలిగాను....కొద్ది రోజుల తర్వాత .

10, ఫిబ్రవరి 2010, బుధవారం

నేనెందుకిలా .......6


చెరొక స్కేలు పట్టుకొని శివా ఒకప్రక్క మధూ మరోప్రక్కా నాకోసం ఎదురు చూస్తూ నిల్చుని ఉన్నారు. "మా ముసుగులు లాగేసి, మానిద్ర పాడు చేస్తావుటే!ఈరోజు నీ పని అయి పోయింది." అంటూ నామీదకు లంఘించాడుశివా.
నేను ఒక్క ఎగురు ఎగిరి వాడిని ప్రక్కకు తోసేసి పరుగుతీశాను తోటలోకి.వాడు కొంతదూరం పరుగెత్తి రొప్పుతూ నిల్చిపోయాడు.కానీ మధూ నావెంట పడింది.అది నాకంటే వేగంగా పరుగెత్త గలదు.నేను వెళ్ళినాన్నగారి కుర్చీవెనుక నిల్చున్నాను."ఏమిటేమీ గోల,మధూ ఊరుకో"" అంటూ నాన్నగారు పరిస్తితులను అదుపులోకి తెచ్చారు.
త్వర త్వరగా తయారయ్యి బయలుదేరాను.నాన్న గారు స్కూటరులోనన్ను తీసికెళ్ళి నిశ్చల యింటి వద్ద వదిలాడు.నిశ్చల పరుగునవచ్చి నన్ను రిసీవ్ చేసుకొంది.
సాయంత్రం వస్తానని చెప్పి నాన్న వెళ్ళిపోయాడు. నిశ్చల ఇంకా స్నానం చేసినట్టులేదు.తలకూడా దువ్వినట్టు లేదు.జుట్టంతా వెనక్కు లాగి రిబ్బన్తో గట్టిగాకట్టివేసింది.ఒక పెద్ద యింటిలో ఔట్ హవుసులో అద్దెకుంటున్నారు వారు.
నన్ను ఇంటి వెనక్కు తీసికెళ్ళింది.అది చిన్న పోర్శన్.ఇంటి ముందు చిన్న బాదంచెట్టుంది.మేము లోపలికి వెళ్ళాము.లోపల వంటిల్లు కాక రెండు గదులున్నట్లున్నాయి.నన్ను హాలులో కూర్చోబెట్టి లోనికెళ్ళింది నిశ్చల.
ఇల్లంతా నిశ్శబ్ధంగా ఉందేమిటి చెప్మా అనుకొంటూ కూర్చున్నాను. నిశ్శబ్ధంలోంచీ నాకేదో అపశ్రుతి విన్పిస్తూంది. కొంత సేపు తర్వాత నిశ్చల ఒక కప్పులోపాలు తీసికొని వచ్చి నా చేతికిచ్చింది.
"అమ్మా నాన్నా లేరా" అడిగాను. "నాన్నగారు బయటకు వెళ్ళారు.అమ్మ లోపలుంది" నేను పాలు త్రాగేవరకూ నిల్చుని లోపలకు రమ్మని పిల్చింది.నన్ను ముందు వంట గదిలోకి తీసికెళ్ళింది.అటు తిరిగి వంట చేస్తున్న ఆమెను చూపి "మా పిన్ని" చెప్పింది.ఆమె తలత్రిప్పి నావైపు చూసి మళ్ళీ అటు తిరిగింది.చిన్న చిరునవ్వు కూడా లేదు.లేకపోగా ముఖంలో కౄరత్వం కొట్టొచ్చినట్టు కన్పిస్తూంది.నాకెందుకో ఆమె నచ్చలేదు.
"అమ్మ?" అడిగాను, నిశ్చలవైపు తిరిగి.ఇంతలో ఒక పెద్దకేక విన్పించింది.ఒకసారికాదు.అలా కేకలు విన్పిస్తూనేఉన్నాయి.నిశ్చల నన్ను గట్టిగా పట్టుకొని "బృందా! నీవు హాల్లో కూర్చో!నేనిప్పుడేవస్తాను.నాతోరాకు--"
గబ గబా నాతో చెప్పేసి పక్కరూములోకి పరిగెత్తింది.’పిన్నితలకూడా తిప్పకుండా వంట చేసుకొంటూ, కను కొలుకుల్లోంచీ నావైపు చూసింది. నేను హాలు వైపు నడుస్తూ,చిన్నతనంలో ఉండే కుతూహలంకొద్దీ, పక్కరూములోకి తొంగి చూశాను.అంతే! నిశ్చేష్టురాలినై నిల్చుండి పోయాను.నాకళ్ళు పెద్దవయ్యాయి.ఒళ్ళంతా చెమటలు పట్టేసింది.నా శరీరంపై నాకే పట్టు తప్పి, లోపలికి అలా చూస్తూండి పోయాను.--
************* ******** ***********
ఆమె నిశ్చల తల్లి అనుకొంటాను.కళ్ళు పెద్దవి చేసి నాలుక బయటకు వ్రేలాడ దీసి పెద్దగా రొప్పుతూంది.రెండు చేతులూ వెనక్కు విరిచి చైనుతో కట్టేసి ఉన్నాయి.జడ ఊడిపోయి జుట్టంతా ముఖం మీద పడుతూంది.చైను లాగుతూ చేతులు గుంజుకొంటూంది.నిశ్చల ఆమెను గట్టిగా పట్టుకొని చెవి దగ్గర "అమ్మా!అమ్మా!" అని పిలుస్తూంది. పిలుపుకి ఆమె కొద్దిగా స్పందిస్తూంది.
ఆమె రెండు బుగ్గలనూ చేతితో పట్టుకొని "అమ్మా! ఏం కావాలి?" అని అడుగుతూంది నిశ్చల.ఈనిశ్చల నాకు ప్రాణ స్నేహితురాలు నిశ్చలగా కాక ఒక మాతృమూర్తిలా ,ఆకాశ మంత ఎత్తుకు ఎదిగిన ఒక స్త్రీ మూర్తిలా కన్పించింది నాకళ్ళకు.ఆమె గుడ్లు త్రిప్పుతూ ప్రక్కనున్ననీటి బిందె వైపు చూపించింది.నిశ్చల బిందెలో నీరు గ్లాసుతో ఆమెకు త్రాగించింది.అవి త్రాగి ఆమె అలాగే మంచంపై వాలి కళ్ళు మూసుకొంది. నెమ్మదిగా వెనక్కు తిరిగిన నిశ్చల గుమ్మంలో నన్ను చూసి నిర్ఘాంత పోయింది.ఇంకా విభ్రాంతిలో ఉన్న నన్ను చేయి పట్టుకొని హాలులోకి నడిపించింది."అమ్మకు బాగాలేదు" అని మాత్రం చెప్పింది.ఇంకేమైనా మాటాడితే పిన్ని వింటుందని భయమేమో!

ఎలాగో సాయంత్రం వరకు గడిపి ఇంటికి వచ్చేశాను.ఇంట్లో ఎవ్వరికీ సంగతులేవీ చెప్పలేదు. రాత్రి కలలో నిశ్చల తల్లి ముఖమే కన్పిస్తూంది.పొద్దున లేచేసరికి ఒళ్ళు కాలి పోతూంది.అమ్మా,నాన్నా,చాలా ఆదుర్దా పడ్డారు. జ్వరం మూడు రోజులు తగ్గలేదు.సర్కసులో పులిని చూసికూడానేనంత భయ పడలేదు. నాకు జ్వరమని తెలిసి నిశ్చ్లల అర్ధం చేసికొంది.ఒక రోజు ఇంటికి వచ్చి "సారీ,బృందా!
నిన్ను మా యింటికి పిలవకుండా ఉండాల్సింది." అంది.నేను చేతులతో దాని నోరు మూశాను ,అలా అనవద్దన్నట్టు..అదీగాక విషయమేమిటో నేను మాయింట్లో ఎవ్వరికీ చెప్పలేదు.....

7, ఫిబ్రవరి 2010, ఆదివారం

నేనెందుకిలా...........5


ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు.వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి.
ఎవరో అత్యుత్సాహంగా నేనింకా బ్రతికిఉండగానే టపాకాయలు కాల్చటం మొదలు పెట్టేశారు.ఇంకెవరో వారిని మందలిస్తున్నారు,కొంచెంసేపు ఆగమని.నెమ్మదిగా కన్నులు తెరవటానికి ప్రయత్నిస్తున్నాను.గుడ్లు కదులు తున్నాయి.కానీ కనురెప్పలు తెరిపి పడ్డం లేదు.ఇప్పుడు కన్నులు తెరిచి నేనింకా బ్రతికే ఉన్నానని నిరూపించుకోవాలి.అది చాలా అవసరం.లేకుంటే నేను బ్రతికుండగానే స్మశానానికి తరలించేట్టు ఉన్నారు.నా గత స్మ్రుతులను పూర్తిగా నెమరువేసుకొనేవరకూ నేను బ్రతికే ఉండాలి.ఆమధుర ఙాపకాలతొ నా మనసు నిండి పోవాలి.నిండుగా ఉన్న గుండెలతో నేను స్మశానానికి చేరుకోవాలి.పునర్జన్మలమీద నాకు అవగాహన లేదు.కానీ మరో జన్మంటూ ఉంటే నేను బృందగా, నిశ్చల నా స్నేహితురాలిగా మళ్ళీ పుట్టాలి.ఇది నా కోరిక.
అంతేగానీ, డొల్లగా ఉన్న మనసుతో వల్లకాటికి పోవటానికి నేను సిద్దంగా లేను.అతి కష్టం మీద నా కళ్ళు తెరిపిడి పడ్డాయి.నాప్రక్కనెవరో "కళ్ళు తెరిచింది! ఇంకా బ్రతికేఉంది" అంటూ అరిచారు.
విషయం అంచెలంచెలుగా అందరికీ చేరిపోయింది---ఏడుపులాగి పోయాయి.మాటలు నిల్చి పోయాయి.అంతా నిశ్శబ్ధం.---కొందరు లేచి ఇళ్ళకు పోవటానికి ప్రయాణమయ్యారు.
మరి కొందరు టీ త్రాగి రావటానికి బయలు దేరారు.పైకి ఎవ్వరూ చెప్పటం లేదుగానీ " ఇంకా ఎంతసేపు ఇలా--" అన్న అర్ధాన్ని స్ఫురింపజేస్తూందీ నిశ్శబ్ధం.

ఎలాగైతేనేం, నా ప్రయాణాన్ని కొంతసేపు వాయిదా వేయగలిగాను.నా ప్రమేయం లేకుండానే మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి.ఆలోచనలు ఆదివారాన్ని చేరుకొన్నాయి.

*******************************************************************************
" బృందా, త్వరగా లే!నిశ్చలా వాళ్ళింటికి వెళ్తానన్నావుగా,నాన్నగారు వదలి వస్తారు!లేచి స్నానంచేసి త్వరగా తయారవ్వు".అమ్మ మేలుకొలుపుతో ఒక్క ఉదుటున మంచంమీదనుండీ
లేచాను.ఒకప్రక్క శివా ,మరోప్రక్క మధూ(చెల్లి పేరు మధుమతి) ముసుగులు తన్ని పడుకొని ఉన్నారు.వారిద్దరి ముసుగులూ లాగేసి బాత్రూంలో దూరి తలుపేసుకొన్నాను.అక్కడేఉంటే ఇద్దరూ
కల్సి నన్ను ఉతికేస్తారని భయం.నేను అల్లరి చేసినప్పుడెల్లా శివా నన్ను కొడుతూంటాడు.ఆడపిల్లలను కొట్టగూడదురా అంటే--కొట్టడానికి ఆడేమిటి మగేమిటి, ఎవ్వరైనా ఒకటే,అంటూ ఇంకా ఎక్కువ చేస్తాడు.నా జిత్తులు వాడి దగ్గర సాగవు.’గంభీరంగా తింటూ బాగా లావయ్యాడు.అందుకేఅంత పొగరు-అనేసి పరిగెత్తేదాన్ని.నేను సన్నగా రివటలా ఉంటానేమో వేగంగా పరుగెత్తేదాని. వాడంత వేగంగా పరుగెత్తలేడు.అందుకే నిల్చుని గుర్రుగా చూసేవాడు.
గబ గబా స్నానం చేసి బయటకు వచ్చాను.కూని రాగం తీసు కొంటూ బయటకు వచ్చిన నేను తలెత్తి చూసి భయంతో కళ్ళు పెద్దవి చేశాను."అమ్మాఅన్న కేక నా నోటి నుండీ అప్రయత్నంగావెలువడింది.

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!