22, జులై 2009, బుధవారం

నాకూ వ్రాయాలని ఉంది



నాకూవ్రాయాలనిఉంది
ఆత్రేయగారి ఆలోచనలతో
పద్మార్పితగారి పదగుంభనముతో
రాధికగారి రాగసుధచినుకులతో
పరిమళం గారి సుమధుర గుబాళింపులతో
నాకూకవిత రాయాలనిఉంది.!
ఉష గారి అదృశ్యమైన బ్లాగుఅందాలలా
నేస్తం గారి నెయ్యం ,తాడేపల్లి కయ్యం
సృజనగారి ఆషాడమాసంలా
మురళి గారి నెమలికన్నంత అందంగా
కొత్తపాళీ కబుర్లంత తియ్యగా
మధుర వాణి గారి చిత్రమంతస్వచ్చంగా
నాకూ కవిత రాయాలనుంది!

17, జులై 2009, శుక్రవారం

మాటాడు కొందాం రా !




మనదేశ ప్రధానీ,పాకిస్తాను ప్రధానీ అప్పుడప్పుడూ మాటాడు కొంటూంటారు.ఈమాటలపేరు చర్చలు.అన్ని పత్రికలూ హెడ్ లైన్స్ ఇదే వార్త.
పత్రికలకు రెండు రోజులు న్యూసుకు ఢోకా లేదు.ప్రజలందరి ఉత్కంఠను జాగ్రుతం చేస్తాయి.ఈ తంతు ఈరోజుది కాదు.ఇప్పటికి ముప్పై ఏళ్లనుంచీ జరుగుతున్నదే.వెనక్కు తిరిగి చూసుకొంటే ఈ మాటల(చర్చల)వల్ల ఒరిగిందేమీ కన్పించదు.బహుశా వారిద్దరూ ఇలా మటాడు కొంటారేమో!
మ.ప్ర(మనప్రధాని) పా.ప్ర(పాకిస్తాన్ ప్రధాని)

మ.ప్ర. హల్లో!బాగున్నరా?
పా.ప్ర బాగున్నానండీ.మీరెలాగున్నారు.మీదేశమెలాగుంది?
మ.ప్ర. అంతా బాగుందండీ.ఏమిటీ?మీగొంతు కొంచం భారంగా ఉందీ.ఆరోగ్యం బాగాలేదా?
పా.ప్ర. కొంచెం జలుబు చేసిందండీ.ఇంకేం లేదు.చెప్పండి .ఏమిటి విశేషాలు?
మ.ప్ర . ఏంలేదు .చాలారోజులైందికదా,పలకరించివెళ్దామని.
పా.ప్ర. నాక్కూడా ఎవరైనా వచ్చి మాటాడితే బాగుండు ననిపిస్తూండింది.తెగ బోరుగా ఉందనుకోండి.
మ.ప్ర .నాక్కూడా విసుగ్గా ఉందం డీ.దీనికి తోడు మాదేశంలో ఈమద్య టెర్రరిజం ఎక్కువయ్యింది.
పా.ప్ర. ఆగొడవలన్నీ ఇక్కడ కూడా తేకు బాబూ.అసలే తలనొప్పిగా ఉంది.
మ.ప్ర. నాకు మటుకూ తేవాలని సరదానా? అటుచూడండి.......(మూలనున్న టీవీ వైపు చూపాడు.అది భారతదేశపు చానల్ లో న్యూసు
"ఇండియా కూ పాకిస్తానుకు మద్య ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి.కాష్మీరు, ఉగ్రవాదం ఈచర్చల్లో ముఖ్యంగా చోటు చేసు కొంటాయని
భావిస్తున్నారు" )
పా.ప్ర .అదిసరే, ఇంతకీ మీ పాప ఏంచేస్తూంది?చదువు పూర్తి చేసిందా?
మ.ప్ర. మొన్ననె పూర్తయ్యింది.తను కూడా రాజకీయాల్లోకి రావాలనుంది.
పా.ప్ర. ఇంకేం.కాబోయేప్రధాని అన్నమాట.మావాడికే చదువబ్బలేదు.మొన్ననే టెర్రరిస్టు ట్రైనింగు పూ ర్తి చేసుకొని బయటకు వచ్చాడు.ఏదేశానికి పంపాలా అని ఆలోచిస్తున్నాను.టెర్రరిస్టులు పట్టుబడ్దా క్షేమంగా ఉండగలిగే దేశం ఏదా అని చూస్తున్నాను.(మ.ప్ర.వైపు అదోలా చూస్తూ)
మ.ప్ర. ఈసారి వర్షాలే లేవు గదా? ఇంతకు ముందెప్పుడూఇలా లేదు.
పా.ప్ర. ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి.అన్నట్టు కంబక్త్ ఇష్క్ సినిమా చూశారా!చాలాబాగుందికదా?
మ.ప్ర . అవును.మాపాప చెప్పింది.కరీనా చాలా లవ్లీ గాఉందట గదా.చూడాలి.
పా.ప్ర .మీకోసం హై టీ అరేంజి చేశాను. లేద్దామా?
మ.ప్ర. ఓకే. ఓకే
రెందు దేశాల్లో జనాలు టీవీ లముందు గుమిగూడి ఆదుర్దాగా చూస్తున్నారు."ఇద్దరు ప్రధానులూ టీ కోసం చర్చలు కొంతసేపు నిలిపివేశారు.టీ తర్వాత చర్చలు మళ్ళీకొనసాగుతాయి"...న్యూస్ .......టీ తర్వాత
మ.ప్ర. టీ బాగుందండీ.ఏమి పొడి?
పా.ప్ర . మాకోసం ప్రత్యేకంగా చేయిస్తాము.మీరు వెళ్ళేప్పుడు ఒక ప్యాకెట్ తీసికెళ్ళండి.
మ.ప్ర .వద్దులెండి.ఎవరైనా చూస్తేబాగోదు.బయట ప్రెస్సు వాళ్ళు ప్రాణాలు తీ స్తారు.ఏంచెబుదాం?
పా.ప్ర . చర్చలు ఒక కొలిక్కి రాలేదనీ,మళ్ళీ కలుసుకొంటామనీ చెబ్దాం.
మ.ప్ర. భలే బాగుందే. అలాగే.......
ఇద్దరూ లేచారు. బయటకు రాబోతూ ఆగాడు పా.ప్ర
పా.ప్ర. అన్నట్టు..మాదేశం వాడు పేరేందీ ఆ.. కసబ్ అనుకొంటా మీరు జైల్లో పెట్టారట గదా.అతన్ని విడిపిస్తే బాగుంటుంది
మీరు బాగా చూసుకోరని కాదూ! అయినా ఇక్కడకు పంపితే బాగుంటుంది.
మ.ప్ర. అలాగే!అదేం భాగ్యం. ఇద్దరూనిష్క్రమించారు.

త్వరలో మళ్ళీ చర్చలు. రెండు దేశాల మధ్య సమశ్యలు పరిష్కారం అయ్యే సూచనలు......పత్రికల్లో హెడ్ లైన్స్

2, జులై 2009, గురువారం

యువ తరం


ఇది ఈ నాటి యువతరం
పట్టింది దీనికి గ్రహచారం !

వ్యక్తిత్వాన్నిఅమ్ముకొని ,
విలువలను చంపు కొని ,
యాచన తో జేబులు నింపుకొని
కుంటుకుంటూ నడుస్తూంది

ఇది ఈ నాటి యువ తరం
పట్టింది దీనికి గ్రహ చారం!

అదుగో ,కట్నం తో భర్తను కొని
విధి లేక అతని చేయి పట్టుకొని
అతని ప్రక్కనే నడుస్తున్నది
విధి వంచిత ఆ చెల్లి!

ఆలోచన లేదు,ఆవేశం తప్ప
సిద్ధాంతాలు లేవు ,చిల్లర బుద్ధులు తప్ప
ఆశయానికి అర్ధం తెలీదు
ఆశలకు మాత్రం లోటులేదు
ఇది ఈ నాటి యువతరం
పట్టింది దీనికి గ్రహచారం!

బాధ పడుతూ కొంటారు భర్తల్ని
ఈరోజు అమ్మాయిలూ
డబ్బు పోతు న్నందుకు కాదు బాధ
ఎవ్వరికి అర్ధం కానిదీ వ్యధ !

ఈరోజు డబ్బు పెట్టి ఒక వస్తువు కొంటాం
రేపు లాభానికి దాన్ని అమ్మివేస్తాం!
లక్షలు కుమ్మరించి కొన్న భర్తను
అమ్ముకొనే అధికారం లేదు ఆమెకు,
ఖస్సు మంటుంది సమాజం,
బుస్సు మంటుంది భర్త కోపం ,
ఉసూరు మంటుంది ఆమె ప్రాణం !

కొంత డబ్బు పెట్టి ఒక ఎద్దును కొంటాం
వాకిటిలో కట్టేసి గడ్డి వేసి నీరు పెడతాం!
చెప్పినపని చేస్తుంది ఆ ఎద్దు,
వృధాగా పోదు దానికి పెట్టిన డబ్బు!

లక్షలు క్రుమ్మరించి భర్తను కొన్నది ఆమె ,
అయినా ఆమెకు అతడే అధికారి!
చెప్పిన పని చేయడు అతడు,
పైగా పురమాయిస్తాడు పనులను.
కూడదను కొంటునే పోల్చుకొంది ఆమె,
ఆ యెద్దునూ,ఈ భర్తనూ
ఈ భర్త కంటే ఆ ఎద్దు నయం కదా!
ష్ష్!అయినా ఆ మాట అనకూడదు గదా!

చిల్లర కోర్కెలు కోరుతున్న చిల్లర భర్తను
చికాకుగా చూస్తుంది ఆమె!
శపిస్తుంది ఈ మగ జాతిని
ఎ పశువులు గానో మారిపొమ్మని !

చదువు పెరిగితే సంస్కారం పెరగాలి,
సంస్కారం తో బాటు హృదయం ఎదగాలి,
ఎదిగిన హృదయం ఆలోచించ గలగాలి
అదీ చదువు లోని పరమార్ధం!

కానీ ,

చడువునుబట్టి కట్నం పెరుగుతుంది ,
యువకుల బుద్ధి మందగిస్తుంది .
అమ్ముడు పోతారు ఆడువారికి,
అభిమానం అడ్డు రాదు వీరికి !

అందమైన ఓ చెలీ
అందుకో నాచేయి
కట్టు బట్ట లతో బయలు దేరి రా
కట్టుకొందాము ఓ పొదరిల్లు
ఆ గృహసీమ కు నీవే రాణివి
ఇక పై నా జీవిత భాగ స్వామివి !
అనగలిగిన యువకుని స్త్రీ ప్రేమిస్తుంది,
అతని గుండెలపై సేద తీర్చు కొంటుంది
అతడే నిజమైన భర్త,
మగ జాతికి మణిపూస!








17, జూన్ 2009, బుధవారం

మధుర భావం


చల్లని వెన్నెల రేతిరి
మెత్తని మావి చిగురుల పక్క పయిన
పవ్వలించాను నేను ఇహము మరచి
కోయిల కూత వినిపించింది
కుహు కుహూ కుహూ మని !

భరించలేని ఒంటరి తనము
ఎర్రని నా కన్నులలో తెల్లని వెన్నెల
అనిపించింది నా మనసుకు
ఎలా ఎలా ఎలా అని!

మెత్తని ఓ మధుర హస్తము
మూసింది నా రెండు కన్నులను
మత్తుగా తొలగించాను చేతులను
హత్తు కొన్నాను నా గుండెలపై
ఆ గుండెల లోపల వొకటే లయ
చెలి చెలీ చెలీ అని!

ఎర్రని మెత్తని అధరాలను
ఆశగాచూస్తున్న నన్ను
ఆగమన్నట్లు చూసింది
ఆపైన నవ్వింది
గల గల గల మని!

జ్యోత్స్నాభిసారిక నా చెలి
పవ్వలించింది నా గుండెలపైనమరి
పరవశించి అనుకొన్నది నా మనసు
నిలిచిపో గూడదా ఈ సుఖం
ఇలా ఇలా ఇలా అని!

ఎంతో సేపు గడువలేదు
కొంత సేపైనా నిలువలేదు
దిగ్గున లేచింది నాపైనుండి
మొగ్గై పోయింది వొక్క క్షణం
దగ్గుత్తికతో పిలిచాను
చెలి చెలీ చెలీ అని!

నల్లని కన్నులు పైకెత్తి
వోరగంట నన్ను చూసి
కదిలించింది కను రెప్పలను
తప టప టప మని!

కూడని పనులను చేసానా
రాగూదని తలపులు వచ్చాయా
భావ గర్భితము నా మనసు
రాగ రంజితము నీ సొగసు
ఎందుకు విడదిసావు ఈ కౌగిలి
ఊరక వుండనివ్వదు నన్ను ఈ జాబిలి!

ఎర్రని పెదవులు కదిలించి
తెల్లని నవ్వును నవ్వింది
మల్లె పూవులు తురిమిందేమో
మత్తెక్కించింది నన్నాప్రక్రుతి !

రయమున నాపై వంగింది
పెదవులు నాలుగు కలిపింది,
వడిగాలేచి వెళ్ళింది
చెంగు చెంగు చెంగు మని!

వెళ్లి పోయింది నా చెలి
మబ్బులు కమ్మిన ఆకాశంలో
తటిల్లున మెరసిన మెరపు తీగెలా
వెళ్తూ వెళ్తూ చెప్పింది
"రేపు","రేపు","రేపు" అని!

రేయి గడిచి పోయింది
బాధ మిగిలి పోయింది
నిదుర లేని నా కనులు
దాల్చినాయి అరుణిమను!!!
























12, జూన్ 2009, శుక్రవారం

క్షమించు ప్రియా-2



ఉహల పల్లకిలో ఊరేగుతూ
ఆశల లోకంలో విహరిస్తూ,
ఆర్తిగా నీకోసం ఎదురుచూస్తూ ,
ఒళ్లంతా కళ్లు చేసుకొని
మనసంతా నిన్నే నింపుకొని,
వాకిలిలో నిల్చుని,నిల్చుని,
విసిగివేసారి,నీపై అలిగి,
అర్థరాత్రి అలిసి ఇల్లుచేరిన నిన్ను
ఎన్నిమాటలన్నానని?
ఈదుర్భర మౌనాన్ని విడనాడి
నన్ను క్షమించు ప్రియా!

7, జూన్ 2009, ఆదివారం

క్షమించు ప్రియా! 1



గుండెలనిండా తొణికిస లాడేప్రేమను
నాపై కుమ్మరించేందుకు సన్నధ్ధుడవై
సంధ్యవేళ రొప్పుకొంటూ రోజుకొంటూ
తలవాకిటి తలుపు తడితే,
బెత్తెడు మల్లెలు తేలేదని నీపై అలిగి
ఖండికనై నీపాలిటి చండికనై,
నీమనసు తూట్లు పొడిచినందుకు
నన్ను క్షమించు ప్రియా!

3, జూన్ 2009, బుధవారం

న్యాయ స్థానాలు


భారత దేశం లో కోర్టులు
ఆపేస్తాయి పేదల హార్టులు!
ఏళ్ళు గడిచినా దొరకదు న్యాయం
వాదనల్లో పస శూన్యం!
రోజులుతరబడి కోర్టులుమూత
పేరుకు పోతున్నకేసుల మోత!
రాజకీయ కేసులంటే ఆరునెలల్లో తీర్పు
సివిలు కేసు వేశావో కావాలి నీకు ఓర్పు !
పెన్షను కోసం కోర్టుకు వెళ్ళిన ఉద్యోగికి
కాటిమీదకు చేరుతాయి కాగితాలు!
స్కూళ్ళతో పాటు కోర్టులకు సెలవులిక్కడ
మూతబడ్డ కోర్టుల్లో చిల్లి బడ్డ జేబుల్తో
పిచ్చివాళ్ళ వలె న్యాయం కోసం ప్రజల వెదుకులాట,!
కళ్ళకు గంతలు కట్టుకొన్న ధర్మదేవత ,
నోటికి టేపులు వేసుకొన్న జడ్జీలు.
పీక్కుతింటున్న లాయర్లు,
అయోమయంలో జనాలు !
ఇదీ ఈ దేశంలో న్యాయవ్యవస్థ!

22, మే 2009, శుక్రవారం

కన్నీటి తో కాసులు.......



కన్నీటి తో కాసులు సంపాదిం చటమెలాగో మీ కెవరి కన్నా తెలుసా !
తెలీకపోతే డబ్బు సంపాదనలో మీరు చాలా వెనుక పడి ఉన్నట్లే .
ఎలాగో తెలుసుకొందాం నాతో రండి!ముక్కున వేలేసుకోవటానికి సిద్దం కండి!
ఇక వెళ్దామా ...ఒన్,టూ,త్రీ ......
ఎవరికై నా ఓటమి ఎదురైనప్పుడు మనసు పాడవుతుంది .ఎవ్వరినీ చూడాలని పించదు.
ఒంటరిగా ఉండాలని అన్పిస్తుం ది.కనీసం కొద్ది రోజు లు స్నేహితులుకు కూడాదూరంగా ఉండాలని కోరుకొంటాము.
ఇది సహజం. పెద్దలకైనా,పిల్లలకైనా!
ఎలక్షన్ రిసల్టు లు వచ్చిన తర్వాత కెసిఆర్ ,ముహం చాటేయడానికీ,అల్లు అరవింద్ అడ్రసు లేకపోవటానికి
ఇదే కారణం.క్రికెట్ లో ఓడిన జట్టు కెమరాకు ముఖం చాటేస్తుంది.వాళ్ళను తప్పుపట్టలేం. ఇది మానవ సహజం.
పెద్దవాళ్ళకే ఇలా ఉంటే ఇక పిల్లల సంగతేమిటి?ఎంత డిప్రెషనుకు లోనవు తారు?
కొన్ని చానల్సు లో పిల్లలకు పాటల పోటీలు నిర్వహిస్తున్నారు.మంచిదే.
ఆ పోటీలోఓడిపో యిన పిల్లలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తారు.
ఆక్షణాలు చానల్ స్వంత దారులకు ఎంతో విలువైనవి.కాసులు రాల్చేవి.
కెమరా లన్నీ జూం అవుతాయి,ఏడ్చే పిల్లల ముఖం మీదికి .
గెలిచిన వాళ్లు మనకు కనిపిం చరు.పాపం!ఎందుకు గెలిచామా అని ఓ మూలన నిల్చుం టారు.
వారుకాదు మనకు కావలసింది.వారి కళ్ళల్లో మెరిసే మెరుపు ఎవరికి కావాలి?
ఓడిన వారి కళ్ళల్లో నీరు మనకు ముఖ్యం.ఎంత ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు,ఎంతకన్నీరుకారుస్తున్నారు?
ఏ యాంగిల్ లో నుంచి ఎక్కువ కన్నీరు చూపించవచ్చు ,అది ముఖ్యం.
కేమరాలన్ని ఏడ్చే పిల్లల ముఖం మీదే !ఎంత శాడిజం!
స్కూలు పరీక్షలో ఫెయిలయి తే ఆత్మ హత్యల దాకా పోయే సున్నిత మనస్కులు పిల్లలు.
వారి పరాజయాన్ని సొమ్ము చేసుకోవాలను కొనే వాళ్ళను ఏమనాలి?
మనకు కడుపులో దేవినట్టు ఉంటుంది.నిజమే.నాకనిపిస్తుంది.ఈ పోటీలన్నీ ఓడేవారి కోసమేనేమోనని .
ఏరి! గెలిచిన వారెక్కడ?ఇదంతా చదువు తుం టే మీకు కడుపు లో ఎలాగో ఉందా?
అయినా సరే!కన్నీటి తో కాసులు సంపాదిం చట మెలాగొ తెలిసిందిగా ! అంతే చాలు!!!!

కొసమెరుపు .....
అడ్వర్ టైస్మెంట్...’వచ్చేవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో (ఎంతకన్నీరు కారుస్తారో)తప్పక చూడండి
లేత కన్నీరు రుచి మరిగిన మనం అన్ని రోజులు ఎలా వేచియుండడం?

20, మే 2009, బుధవారం

కసబ్ నవ్వాడు


కసబ్ నవ్వాడు.
'ఎక్కడిదీ లత్తకోరు జ్ఞానమని'
ప్రపంచం లో మరే సమస్యా లేనట్లు
మనం బుర్ర బద్దలు కొట్టు కొంటుంటే
నత్త నడక నడుస్తున్న మన న్యాయ వ్యవస్థను చూసి
కసబ్ నవ్వాడు!
రాజీవ్ గాంధి పోయినప్పుడు మొదలై
ప్రభాకరన్ పోయినా తేలని కేసును చూసి
తీర్పులివ్వకుండా నిద్రలో జోగుతున్న జడ్జీలను చూసి,
న్యాయ వాదుల సమ్మెలతొ మూతలు పడుతున్న కోర్టులు చూసి,
మేడులు పడుతున్న కేసులు చూసి ,
తారుమారవుతున్న సాక్షులను చూసి,
కసబ్ నవ్వాడు!
తంతే బురెలబుట్టలో పడ్డట్టు
భారత దేశం లో పడ్డ తన అదృష్టం తలచుకొని ,
కసబ్ నవ్వాడు!
పట్టుబట్ట మొదట్లో చంపెయ్యమన్న తన ముర్ఖత్వాని తలచుకొని,
తన జీవితానికిక డోకా లేదని తెలుసుకొని,
కోపంతో ముద్దుగా మందలిస్తున్న జడ్జీలను చూసి
గారాం చేస్తూ , మారాం పొతూ ,
మళ్ళీ కసబ్ నవ్వాడు!

8, మే 2009, శుక్రవారం

నేనెందుకిలా -4


అంతే హాలంతా గందరగోళమైపోయింది.అందరూలేచి పరుగెత్తసాగారు.జనమంతా చెల్లచెదురై పోయారు.ఆతొక్కిసలాటలో ఏంజరుగుతోందోతెలీటం లేదు.ఎవరు ఎక్కడున్నారో అర్ధంకావటంలేదు.పులిపిచ్చిపట్టినట్టు నాలుగు మూలలకూ పరుగెడుతూంది.చిన్నపిల్లలు పెద్దవాళ్ళకాళ్ళక్రింద పడి నలిగిపోతున్నారు.సింధుజ నాన్నగారు సింధుజను ఎత్తుకొని బయటకు పరుగెట్టేశాడు.నేను నిశ్చల చేతిని గట్టిగా పట్టుకొన్నాను.మాప్రెండ్సందరినీ అలాగే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొమ్మని గట్టిగా అరిచి చెప్పాను.పులి అన్ని దిక్కులూతిరుగుతూ మావైపు దూసుకు రాసాగింది.అందరం పెద్దగా యేడుస్తున్నాం.ఈ జీవితంలో ఇధే ఆఖరు రోజేమో -నా మాటలు వినివీరంతా సర్కసుకు వచ్చారు.
నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.వీరిని కాపాడాలి.నాలో వెర్రి ఆవేశం ప్రవేశించింది.అంతే! ఎటువంటిపరిస్తితుల్లోను చేతులు వదలవద్దనిఅరిచి చెప్పాను.వేగంగా ద్వారం వైపు పరుగెట్టాను.సర్కసు నిర్వాహకులందరూ వలలు పట్టుకొని రంగంలోకి దిగారు.పులిని పట్టటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.మేము ఎలాగో బయట పడి పోయి టెంటుకు దూరంగా పరుగు లంకించుకొన్నాము


*** *** ***
ఆరోజు ఈవినింగ్ పేపర్లలో అంతా ఇదే న్యూసు.సర్కసు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.
అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు పిల్లలు చనిపోయారు.వింత ఏమిటంటే పులి ఒక్కరిని కూడా చంపలేదు.మా వీధంతా ఒకటే గోలగా ఉంది.
నా ఫ్రెండ్స్ పేరెంట్సు వచ్చి నాకు థాంక్సు చెప్పారు.సింధుజ తండ్రి గారిని అందరూతిడుతున్నారు,చిన్నపిల్లలను వదిలేసి తనదారిన తాను పరిగెత్తి పోయినందుకు.అతను చేసింది తప్పో రైటో అప్పుడు నాకు తెలీలేదు.ఆతర్వాత ఆవిషయం నేనాలోచించలేదు.---
రెండవరోజు స్కూలులో అంతా ఇవే కబుర్లు. టీచర్సందరూ నన్నభినందించారు.సింధుజ మాత్రం దూరదూరంగా ఉంది, బహుశా వాళ్ళ నాన్న చేసిన పనికి సిగ్గు పడుతూందేమో! కానీమేము ముందే అనుకొన్నాము సింధుజదగ్గరఎవరూ ఆ విషయంఎత్తగుడదని .సాయంత్రం అందరూఇళ్ళకు వెళ్ళేముందు సింధుజ నాదగ్గరకు వచ్చింది.దానికళ్ళు బాగా వాచి వున్నాయి.ఎర్రగా మంకెన పూవుల్లాగా ఉన్నాయి."సారీ బృందా! మానాన్న అలా చేసి ఉండ కూడదు..." ఏడుపు తో దాని గొంతు పూడుకు పోయింది.
నేను దాని భుజాలు గట్టిగా పట్టుకొని నా కేసి హత్తుకొన్నాను. ఆహా! స్నేహబంధం ఎంత మధురమైనది.నా కళ్ళల్లోంచీజారిన కన్నీరు దాని భుజాలు తడిపేసింది.ఈసంఘటన మా అందరిమధ్యన ఉన్న స్నేహ భంధాన్ని ఇంకా పటిష్టంచేసింది.
ఒక ఆదివారం నిశ్చల నన్ను వారింటికి ఆహ్వానించింది.రోజంతా ఉండేట్టు రమ్మంది.ఇంకెవ్వరినీపిలవలేదు.
కానీ ఆ ఆదివారం నాజీవితగమనాన్ని మార్చివేస్తుందనీ,సాఫీగా సంతోషంగా సాగిపోతున్న నా జీవితంలో ఆలోచనా తరంగాలను రేపుతుందనీ,నిశ్చలను నా ప్రాణ సఖిని చేస్తుందనీ ఊహించలేకపోయాను.
అందుకే ఆ ఆహ్వానాన్ని అంగీకరించాను..........
మిగిలిన భాగాలకోసం   ఇక్కడ  నొక్కండి 

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    16 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!