25, ఆగస్టు 2011, గురువారం

నేనెందుకిలా 17


                                                                

ఆరోజు శుక్రవారమనుకుంటాను..ఏమిటో! ఇంత చిన్న వయసులోనే  ఏమీ గుర్తుండటం లేదు.ఈ ఇంట్లో, ఈ గదిలో ఎన్నిరోజులిలా?
ఏమీ చెయ్యకుండానే ఈ జీవితం గడిచి పోతుందా? బాల్యంలోనే వృద్దురాలినయ్యానా?ఉదయాన్నే లేచి కిటికీ ఊచలు పట్టుకోని వీధిలోకి చూస్తూనిల్చున్నాను.ఇధి నా దైనందిన చర్య అయిపోయింది.స్కూళ్ళకు పోయే పిల్లలు, ఆఫీసులకు పోయేవారు, వీధంతా సందడి  సందడిగా ఉంటుందికానీ ఈ చైతన్యంలో నేను భాగస్వామిని కాలేను.ఈ సమాజం లో నేను ఇమడ లేను.నాకన్నులలోంచీ రెండు కన్నీటి బొట్లు బుగ్గలపైనుండీ జారాయి. ఈమధ్య ఇంట్లో వారుకూడానాతో మాటలు బాగా తగ్గించేశారు.శివా కూడా నాతో మునుపటిలా మాట్లాడటం లేదు..ఇదంతా నాఊహేకావచ్చు.కానీ కొంత నిజం కూడా లేక పోలేదు. ...............ఆలోచిస్తున్న నేను ఉలిక్కి పడ్డాను.బయట ఏదో గోల గోలగా ఉంది.పాటలు,నవ్వులూ అరుపులుతో ఒక గుంపు ఎదురింటిలోకి చొరబడుతూంది.వాళ్ళెవ్వరో ఊహించి నా ఒళ్ళు చెమటలు పట్టింది.ఎదురింట్లో బిడ్డను ఆశీర్వదించి డబ్బులు తీసుకోడానికి వచ్చిన కోజ్జాల గుంపది.
                                                                     చిన్న తనంలో అటువంటి వాళ్ళను చూస్తే ఎంత సరదాగా ఉండేదో !వాళ్ళ చుట్టూ మూగిపోయే వాళ్ళం .కానీ నా జీవిత గమనంలో వారు భాగ స్వాములు అవుతారనీ అసలు వారే నాజీవన నావకు చుక్కానులవుతారనీ ఆరోజు ఊహించనయినా లేదు.వారు గుంపు గా పాటలు పాడుతూంటే నా మనసు లో ఏవో సంతోష తరంగాలు లేస్తున్నాయి.ఒళ్ళంతా తుళ్ళుతున్న అనుభూతి.నాకు తెలీకుండానే కాళ్ళు అటువైపు లాగేస్తున్నాయి.తలుపు తీసుకుని అటువైపు పరుగెత్తాను.మదినిండా సంతోషం.!
ఆరడిపెడుతున్న అత్తింటి చెర వొదిలించుకుని పుట్టింటి వైపు పరుగులెడుతున్న ఉత్సాహం! నా భవిష్యత్తును బందీగా మార్చే శ్రుంఖలాలను
తుత్తునియలు చేసి స్వతంత్ర సామ్రాజ్యం వైపు పరుగులు పెడుతున్న తెగింపు.!   ఆగుంపులో కలిసిపోయి వారితో పాటు చప్పట్లు కొట్టటం మొదలుపెట్టాను. పదిహేనుమందికిపైగా ఉన్న ఆ గుంపులో నన్నెవ్వరూ గుర్తించలేరు. కొత్తగా వారితో చేరిన నన్ను అందరూ ఆగి మరీ చూడసాగారు. నేను ముక్కు మీదవేలేసుకుని సీను క్రియేటు చెయ్యవద్దన్నట్టు సైగ చేశాను.దాంతో అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!