28, సెప్టెంబర్ 2010, మంగళవారం

నేనెందుకిలా............15


                                        

నిశ్చల  చెప్పిన విషయం నా మీద తీవ్రంగానే పని చేసింది. పక్క రోజే నాన్నగారి గదికెళ్ళాను.తలవంచుకొని గుమ్మంవద్ద నిల్చున్న నన్ను ఆప్యాయంగా పిలిచారు నాన్న. నా కన్నులలోనీరు తిరిగింది "నాన్నా! "అన్నాను తల వంచుకొనే. నా చుబుకం పట్టుకొని తలపైకెత్తి అన్నాడు నాన్న."అబ్బో! అల్లరి బృందకు నాదగ్గరకూడా మొహమాటమెప్పటినించో?"తలెత్తి నాన్న గా రి వైపు చూ శాను. 
"నాన్నా!శివా సెక్సు మార్పిడి చెయ్యొచ్చంటున్నాడు". చెప్పలేక చెప్పాను.నాన్న నన్నొదిలేసి బీరువాదగ్గరకు వెళ్ళాడు.నేను చెప్పింది ఆయన వినలేదేమో అనుకొన్నాను.చేతిలో ఒక ఫైలు తో వచ్చారు నాన్న. ఇలా చెప్పసాగారు "బృందా! నీవిషయం బయట పడ్డప్పటి నుంచీ నేను తిరగని ఆసుపత్రి లేదు.కన్సల్ట్ చేయని డాక్టరు లేడమ్మా!  నిజానికి  శివా కంటే నీ కోసమే  ఎక్కువగా తిరిగాను.నీ విషయంలో మనం దురదృష్టవంతులం బృందా!నీకు  ,ఈస్ట్రోజన్,మాస్కులైన్ నిష్పత్తి 50:50 ఉంది.35:65 ఉంటే తేలిగ్గా సెక్సు మార్పిడి చేసుకో వచ్చు.40:60వరకు కూడా ప్రయత్నించవచ్చు. కానీ నీ విషయం లో  అది సాధ్యం కాదని చెప్పారమ్మా.ఈ వి షయాలన్నీ నీ కు చెప్తే బాధ పడతావని చెప్పలేదు."  నా కన్నులనిండా నీరు గిర్రున తిరిగింది.నేనెంత పాపిష్టి దాన్ని.నాన్నగారిని ఎంత తక్కువగా అంచనా వేశాను.
ఉన్నఫళంగా క్రింద కూలబడి నాన్న గారి కాళ్ళు పట్టుకున్నాను."నన్ను క్షమించండి నాన్నా"అన్నాను ధుఖంతో పూడి పోయిన గొంతుతో.
వంగి నన్ను లేవతీశారు.నన్ను గట్టిగా హత్తుకున్నారు నాన్న. ఆశపడ్డ ఆ ఒక్క అవకాశం కూడా లేదని తెలియటం తో మనసు భారమయ్యింది.
చిన్నగా వెను దిరిగాను.
   

7, ఆగస్టు 2010, శనివారం

నేనెందుకిలా.......14

                                                                            
పక్క రోజు జరిగిన సంఘటన నా జీవితాన్ని మలుపు తిప్పిం దనే చెప్పాలి .ఉదయాన్నే నాగదిలో కూర్చొని ఏదో పుస్తకం తిరగేస్తున్నాను . హథాత్తుగా ఊడి పడింది నిశ్చల.నా ఆనందానికి అవధులే లేవు .ఎన్నిరోజులయ్యింది  నిశ్చలను చూసి ?
మామధ్య ఎన్ని  మాటలు దోర్లిపోయాయని? నిశ్చలను చూసి నా ధుః ఖాన్ని పూర్తిగా మరచి పోయాను.మనసు నిండా  సంతోషమే!మా మాటల్లో పొంగి పొరలుతున్న ఉత్సాహం .ఎంతసేపు గడిచి పోయిందో తెలియనే లేదు, అమ్మ వచ్చి భోజనానికి పిలిచేవరకు.భోజనాలు చేసి నారూము లో  కబుర్లు చెప్పుకొంటూ పడుకొన్నామిద్దరం. అప్పుడు చెప్పాను నిశ్చలకు మానాన్న చేసినపని గురించి.'నేను మానాన్నకు ఇంత భారమౌతాననుకోలేదు నిశ్చలా!' అన్నాను కన్నీటితో.నిశ్చల నా కన్నీరు తుడిచింది.
కొంత సేపు మౌనంగా ఉండి పోయింది.'ఏమిటే! మౌనంగా ఉన్నావ్?'మానాన్న చేసిన పనికి ఆశ్చర్య పోతుందని ,ఆయన్ను నాఎదుటే తిట్టి పోస్తుందని ,ఆశించిన నాకు దాని మౌనం అర్ధంగాలేదు.కొంత సేపు తర్వాత నింపాదిగా అంది నిశ్చల .
'మీ నాన్న చేసిన దాన్లో తప్పేం కన్పిచడం లేదు నాకు.బృందా !నెమ్మదిగా ఆలోచించి చూడు.నువ్విప్పుడు  సంతోషంగా ఉన్నావా?
బయట నీ ముఖం  చూపి ఎన్ని రోజులయ్యింది? ఎన్ని అవమానాలు ? ఎంత మనో వేదన? ఎన్నిరోజులిలా?  జీవితం దుర్భర మౌతుంది బృందా! నువ్వు భరించలేవు .మీనాన్న చేసినపనిలో ముందు చూపు ఉంది.నువ్వు ఆవేశంలో అర్ధం చేసుకోవటంలేదు' 
ఆశ్చర్యంతో నా కన్నులు పెద్దవయ్యాయి. నిశ్చల కూడా ఇలా చెప్తుందేమిటి ?
ఈ  ఇంటిని నావాళ్ళను వదిలి వెళ్లి పోవాలా  ?ఎక్కడికి?
అలొచిస్తూనే   అన్నాను 'శివా నాకు సెక్షు మార్పిడి చేయిస్తానన్నాడు నిశ్చాలా!'
నిశ్చల నా వైపు చూసి చిన్నగా నవ్వింది. 'నాన్న గారిని నువ్వు తక్కువగా 
అంచనా వేసుకొంటున్నావు బృందా! ఈ విషయాలన్నీ కనుక్కోకుండానే ఆ నిర్ణయానికి 
వచ్చాడంటావా?'  నేనెంత పిచ్చిదాన్ని? నాన్నను గురించి ఎంత తొందర పాటుగా
ఆలోచించాను? ఆవెశంలో ఎంత అపార్దం చేసుకొన్నాను?
.

19, మే 2010, బుధవారం

నేనెందుకిలా............13

          
               నన్ను చూసి ఆవ్యక్తి వినయంగా లేచి నిల్చున్నాడు.ఆ శ్చర్యంతో అతని ఎదురుగా కుర్చీలో కూర్చున్నాను.అతను చూడటానికి అందంగానే ఉన్నాడు.
ఇతనికి నాతో పనేమిటి చెప్మా అనుకొం టూ చూస్తూన్న నన్ను చూసి చిన్నగా నవ్వాడు అతను.నాన్న గారు మా ఇద్దరి వైపూ చిరునవ్వుతో చూస్తూ కూర్చుని ఉన్నారు.
నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ మొదలుపెట్టాడతను.  "నేను అరవాణి సంఘం రెప్రసెన్టేటివును.చెన్నై నించీ వస్తున్నాను.మీలాంటి వాళ్ళకోసం ఈ సంఘం స్థాపించపడింది.మీలాంటి వారందరూ ఒకచోట చేరి సేవా కర్యక్రమాలు చేస్తూంటారు.మిమ్మల్ను పోషించే భాద్యత సంఘమే తీసుకొంటుంది.మీకు నెల నెలా కొంత జీతం కూడా ఇస్తారు.మీరు సగర్వంగా తలెత్తుకొని బ్రతకటా నికి మా సంఘం సహాయ పడుతుంది.మీలాంటి వారు మూడు వందల మంది ఇప్పటికే ఈ సంఘంలో చేరివున్నారు.మీరు సరే నంటే ఇప్పుడే ఫార్మలిటీస్
పూర్తి చేద్దాం."   అంటూ సూటుకేసులోంచీ కొన్ని పేపర్లు బయటకు తీశాడు.నా కాలిక్రింద భూమి కదలసాగింది.నోరు ఎండిపోయింది.నాలుకతో పెదవులు తడుపుకొంటూ అడిగాను  " అరవాణి అంటే"   అతను నావైపు చూసి చిన్నగా చెప్పాడు   "తమిళంలో అరవాణి అంటే ’కొజ్జా’ అని అర్ధం"
నాకడుపులోంచీ దుఃఖం ఎగదన్నుకొస్తూంది ఉప్పెనలా.అంతటి దుఃఖాన్నీ చిరునాలుకతో గొంతులో  నొక్కిపట్టి  అడిగాను :నన్ను గురించి ఎలా తెలిసింది"
అతను సూటుకేసులోంచీ ఒక ఉత్తరం తీసి చూపిస్తూ చెప్పాడు  "మీనాన్నగారే ఈ ఉత్తరం మాకు వ్రాశారు"
నాగొంతు లోంచీ కెవ్వుమన్న కేక వచ్చింది.కన్నీటితో నిండిన కన్నులలోంచీ నాన్న గారివైపు చూశాను.తలదించుకొని కూర్చున్నాడు.
’నేను మీకింత భారమయ్యానా నాన్నా!" అని మాత్రం అనగలిగాను.ఆపై దుఃఖంతో గొంతు పూడుకుపోయింది.రెండు చేతుల మధ్యతలనుంచుకొని పెద్దగా ఏడవసాగాను.
గది గుమ్మం వద్ద నిల్చుని అంతా వింటున్న అమ్మ చెంగున నాదగ్గరకు దూకింది.నా తలను చేతులతో పట్టుకుని పొట్టకాన్చుకుని జుట్టు నిమురుతూ అతనితోఅంది
"మీరు దయచేసి బయటకు వెళ్ళండి" అంది తర్జనితో వాకిలి చూపుతూ.
’మేము కొజ్జాలకు సేవ చేస్తున్నాం.ఇది మీకు చాలా మంచి అవకాశం......’  ఇంకా ఏదో చెప్పబోతున్నాడు
వెనుక నించీ శివా ఒక్క ఉదుటున అతని దగ్గరకు దుమికాడు.అతని చేతులలోని పేపర్లు లాక్కుని చింపేశాడు.వాడి కళ్ళలోంచీ నీళ్ళు ధారగా కారుతున్నాయి.”మా బృంద మాకు భారంకాదు.దయచేసి వెళ్ళి పొండి ’ అరుస్తూ చెప్పాడువాడు.
అంతటి దుఃఖంలోకూడా ఒక చిన్న ఆనంద వీచిక నన్ను తాకింది.శివా కు నేనంటే ఎంత ప్రేమ.
అతను నాన్న వైపు ఒక చూపు చూసి నిష్క్రమించాడు.
"ఎంతపని చేశారండీ.బృంద లేకుండా మనం బ్రతక గలమా  " అంది అమ్మ కన్నీటి తో
శివా నాన్న వైపు కోపంతో చూడసాగాడు.   నామట్టుకూ నేను ఎవ్వరినీ ద్వేషించే స్తితిలో లేను.పెన్నిధి లాగా దొరికిన అమ్మ నడుము గట్టీగా పట్టుకొని  ఏడవసాగాను.నాన్న ఏదో సణుక్కొంటూ లోనికెళ్ళిపోయాడు.
అప్పుడు శివా అన్నాడు అమ్మతో  ’అమ్మా! బృంద ను డాక్టరుకు చూపించి సెక్సు మార్పిడి చెయ్యిస్తే. ఈరోజుల్లో జరగనిదేంఉంది,డబ్బు ఖర్చు పెట్టాలేగాని.’
నేను శివా వైపు ఆశ్చర్యంగా చూడసాగాను.........ఇది జరుగుతుందా????????
 పూర్తి  నవల కోసం  ఇక్కడ  క్లిక్ చేయండి .

16, మే 2010, ఆదివారం

నేనెందుకిలా............ 12

"మా ఫ్రెండ్సందరూ నన్ను గేలి చేస్తున్నారు బృందా !మీచెల్లెలు లాగే నీవుకుడా నేమో! ఒకసారి చూసుకో. అంటు ఒకటే ఎగతాళి చేస్తున్నారే !నాకైతే ఏడు పోస్తుంది..నీకు చెప్పి నిన్ను బాధ పెట్టగూడ దనుకున్నాను.కాని తప్పలేదు బృందా!కాలేజి మానేద్దామను కొంటు న్నానే!" వాడి కళ్ళల్లో చివ్వున నీళ్ళు చిమ్మాయి.నేను గాజు కళ్ళతో వాడికేసి చూడసాగాను.
అంటే,నేనిప్పుడేం చెయ్యాలి? చచ్చి పోవాలా? నేను చేయగలిగింది అది ఒక్కటే గదా.వీడి ఉద్దేశ్యం గూడా అదేనా?
"శివా! నేనేం చేయనురా? చెప్పు.నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను.కానీ చచ్చిపోమ్మని మటుకు చెప్పకురా.నాకంతధైర్యం లేదురా.
నాకప్పుడే చచ్చి పోవాలని లేదురా " రెండు చేతులతో తలకొట్టు కొంటూ పెద్దగా ఏ డవ సాగాను .
శివా నా రెండు చేతులు గట్టిగా పట్టుకొని  నా తలను వాడి గుండెల కదుము కున్నాడు.ధుక్కంతో వాడి గుండెలు ఎగిసెగిసి
పడుతున్నాయి.
    **********          ************************  *********
                                       మండు వేసవిలో చిరుజల్లులు కురిసినట్టు మా కుటుంబంలోకూడా ఒక సంతోష సంఘటన జరిగింది.శివా ఆపరేషన్ జయప్రదమయ్యింది.వాడు పూర్తి ఆరొగ్యవంతుడయ్యాడు. మా యింట్లో సంతోషం వెల్లివిరిసింది.చాలా రోజుల తర్వాత  సందడి ,సంతోషం, నవ్వులతో మాయిల్లు కళ కళ లాడింది.వారంరోజులపాటు నన్ను నేను మరచి ఆ వేడుకలలో భాగం పంచుకొన్నాను.అమ్మా నాన్న లను అలా సంతోషంగా చూసి ఎన్ని రోజులయ్యిందని.
                                              ఆరోజు ఆదివారం. అందరూ ఇంట్లోనే ఉన్నారు.గేటు చప్పుడైతే కిటీకీలోంచీ బయటకు చూశాను.ఎవరో పాతికేళ్ళలోపు యువకుడు లోనికి వస్తున్నాడు .నేను నాగదిలోదూరి తలుపేసుకొన్నాను.ఈమధ్య  చిన్న అలికిడైనా గుల్లలోకి దూరి ఆత్మ రక్షణ చేసుకొనే నత్త లాగా నేను బయట చిన్న అలికిడైనా నా గదిలోకి దూరిపోతున్నాను.ఇంటికివచ్చేవాళ్ళంతానా వైపు అదోలా చూస్తున్నారు.అసలు నన్ను చూడడానికే కొందరు పని లేక పోయినా వస్తున్నారేమోనని నా అనమానం .కానీ ఆ వచ్చినతను చేతిలో  సూటుకేసుతో  దిగాడు .ఎవరైనా బందువేమో !
నా ఆలోచనలనంతం చేస్తూ కొంచెం సే పు తర్వాత  తలుపు శబ్ద మయ్యింది.                 నాన్న!
'నీకోసం ఎవరొచ్చారో చూడు !'       నాకోసమా? ఈ భూప్రపంచంలో నాకో గుర్తింపు ఉందా? నన్ను చూడడానికి ఎవరైనా వస్తారా?
ఎవరునాన్నా?      'వచ్చి చూడు '    సంభ్రమంగా నాన్న నను సరిం చాను .................

30, మార్చి 2010, మంగళవారం

నేనెందుకిలా-------11

నేనువద్దనుకున్నా నాకు ఎదురైన అనుభవాలు ,నా జీ వితంలో సంభవించిన సంఘటనలు ,నా మనస్సును నలిపి నాశనం చే శాయి. రోజులు గడీచే కొద్దీ నేను పొడుగ్గా అయి పోసాగాను. నేనిప్పుడు మా క్లాసులో అందరికన్నా పొడుగు.
ఇప్పుడు గమనిస్తుంటే ,సిగ్గుగా ఉంది. అందరూ నావైపు వింతగా చూడసాగారు.నా గొంతులో మార్ధవం మాయమై కర్కశత్వం చోటు చేసుకొంది. నేనెం త జాగ్రత్తగా ఉన్నా నాహావభావాల్లో కొట్టొచ్చినట్టు  మార్పు కనిపిస్తూంది.
నిశ్చల కూడా నాకు సాధ్యమైనంత దూరం గా ఉండడం గమనించాను. ఆరోజు అందరూ గేమ్సు క్లాసుకెళ్ళారు. క్లాసురూములో నేనూ నిశ్చలా మాత్రమే మిగిలాము.నిశ్చల నాకోసమే ఆగినట్లుంది.నాతో ఏదో మాటాడాలను కొన్నట్టుంది.గేమ్సు క్లాసులో నేను గ్రౌండుకు పోవటం మానేసి చాలారోజులయ్యింది.ఎవ్వరూ నాతో ఆటలకు రావటంలేదు.ఒంటరిగా కూర్చోవాలి. అందుకే క్లాసులో కూర్చొని ఏదో పుస్తకం చదువుకొంటూంటాను.అన్ని ఆటలకూ ఒకప్పుడు నేనే లీడర్ని.నేను చెప్పేదే వేదం. ఇప్పుడు నాజీవితమెంత దయనీయంగా మారింది.స్నేహితులందరూ ఒక్కొక్కరేదూరమయ్యారు.ఈ జీవన ఝురిలో నేనొంటరినై,తోడులేక ,స్నేహితులు కరువై ఎంతకాలమిలా కొట్టుకు పోవాలి?
హటాత్తుగా నిశ్చల నావై పు దూ సుకు రాసాగింది.నేను ఖిన్నురాలినయ్యాను. భయంగా లేచి నిల్చున్నాను.నాకు చిన్నగా నవ్వువచ్చింది.నిశ్చలను చూసి నేను భయపడట మేమిటి? ఒకవేళ అది బిడియమేమో!
పరుగెత్తుకొచ్చిన నిశ్చల నాదగ్గరకువచ్చి నిలబడి పోయింది.నా చేతులుగట్టిగా పట్టుకొని భోరుమని ఏడవ సాగింది.దాన్ని అలా చూసి నాకుకూడా ఏడుపు ముంచుకొచ్చింది.నాకన్నులు చెరువులేఅయినాయి.దాన్ని కౌగలించుకొని
పెద్దగా ఏడ్చేశాను."బృందా! ఎందుకే ఇలాగయ్యింది?నువ్వెంత మం చిదానివి?భగవంతుడెంత నిర్ధయుడు.నీవు నా ప్రాణ స్నేహితు రాలివి. నీకో సం నేను చచ్చిపోవటానికి కూడా సిద్దంగా ఉన్నానే.నేను నీకేంచేయగలను?చెప్పు బృందా చెప్పు!" ఆ భావావేశంలో అది నా బుగ్గలపై ముద్దులు పెట్టుకో సాగింది.అంత దుఃఖం లో కూడా సంతోషంతో నామనసు నిండి పోయింది.నాకోసం కన్నీరు కార్చటానికి నాకొక ప్రాణ స్నేహితురాలుంది.అదిగూడా నేనత్యంతంగా ప్రేమించే నిశ్చల.నాజీవితం  సార్ధక మయ్యింది.నా నిశ్చల మామూలు గా అందరిలాంటి స్నేహితురాలుగాదు.నేనే దాన్ని అపార్ధంచేసుకొన్నాను.ఆకౌగిట్లో మాఇద్దరి తనువులొకటై,మనస్సులో మనస్సు లయించిపోతున్నసమయంలో
"బృందా!","నిశ్చ్లలా " అన్నకేక,మాఇద్దరినీ దిగ్గున విడదీసింది.ఎదురుగా మేడం, కొంతమంది మాక్లాసు అమ్మాయిలు నిల్చుని ఉన్నారు.మేము సిగ్గుతో తలలు దించుకున్నాము.
  "నిన్ను ఇన్ని రోజులు స్కూల్లో ఉంచటమే తప్పు." అంటూ ప్రిన్చిపల్ రూం వైపు దూసుకు పోయింది మేడం .ఆరోజే స్టాఫ్ మీటింగ్ జరిగింది.నాకు టిసి ఇవ్వటం ఖరారైపోయింది.మానాన్నను పిలిపించి టిసి ఇచ్చేశారు.
************************************************************************************************
                                                    "బృందా" పిలిచాడు శివా. వాడు  నాతో ఎక్కువగా మాటాడుతున్నాడిప్పుడు.వాడి పరిస్తితి వాడికి తెలియకుండా జాగ్రత్త పడ్డామందరం.ఇంకొక పదహైదు రోజుల తర్వాత ఆపరేషనుకు డేటిచ్చారు డాక్టర్లు.ఇంట్లోనేకూర్చొని చదువుకొంటున్నాను నేను.బయటకు వెళ్ళ్టటం దాదాపుగా మానేశాను.వీధిలో అందరూ నావై పు అదోలా చూస్తున్నారు.నా వెనుక నవ్వుకొంటున్నారనుకొంటాను.
"ఏమిటి శివా"  ఆరోజు ఆదివారం. ఇంతకు ముందు ఆదివారమొస్తే ఇల్లంతా సందడి సందడిగా ఉండేది. నేను స్నేహితురాళ్ళింటికి వెళ్ళటం, ఒక్కోసారి వారు ఇక్కడకు రావటం,మా ముగ్గిరి కొట్లాటలుతో ఇల్లంతా గోలగోలగా ఉండేది.
ఇప్పుడు ఆసంతోషమేది!.ఆసందడి ఎక్కడ?మునిగి పోతున్న నావలో ముక్కు మూసుకొని కూర్చున్న నావికులవలె ఎవరి ఆలోచనల్లో వాళ్ళు.అపరిచితులైన ప్రయాణీకులమల్లే రోజులు గడుపు తున్నాము.
  "నేనొక్క మాట  చెప్తే నీవేమనుకోవుగదా!" వీడెంత ఎదిగి పోయాడు .నాతోకూడా ఫార్మల్ గా మాటాడు తున్నాడు."చెప్పు శివా"
వాడు చెప్పినమాట విని నేను హతాశు రాలినయ్యాను.కళ్ళు కొద్దిగా తిరిగిన ట్లనిపించింది.మంచం గట్టిగా పట్టుకొని కూర్చున్నాను............

26, మార్చి 2010, శుక్రవారం

నేనెందుకిలా....10

ఆ రోజు నించీ నా జీవనగమనంలో విపరీతమైన మార్పు వచ్చింది. చైతన్య వంతమైన సమాజంలో ఉంటూనే మౌనినైపోయాను.శరీరంలోకలుగుతున్న వికారాలు నన్ను క్షణ క్షణం భాదించ సాగాయి. భగవంతుడా! నేనెలా జీవించాలనుకొన్నాను? నాజీవితం ఎందుకిలాగయ్యింది.?నేను  చేసిన పాపమేంటి?
నా ఈశరీరమేకాదు,మాకుటుంబమే తుఫానులో చిక్కుకొంది. నేను అత్యధికంగా ప్రేమించే వాళ్ళే నాకు దూరంకాసాగారు.
ఒకరోజు శివాకు జ్వరంవచ్చిందని డక్టరుదగ్గరకు తీసికెళ్ళాము. పరీక్షల్లో వాడికి బ్రైనులో ట్యూమరు ఉన్నట్టు బయట పడింది.
ఇంటిల్లపాదీ హతాసులమయ్యాము.అమ్మైతే చిక్కి శల్యమైపోయింది.మొన్నటి వరకూ ఆనందంగా ఉన్న మాకుటుంబంలో ఒక్క సారిగా ఎంత విషాదం?
సంతోషానికీ దుఃఖానికీ మధ్య రేఖ ఎంత స్వల్పమైనది!
నాన్నగారు వాడిని తీసికొని తిరగని ఆసుపత్రి లేదు. ఎక్కడికెళ్ళినా ఒకేమాట.ఆపరేషన్ చేయాలి.ప్రాణానికి గ్యారంటీలేదు.ఒకవేళ బ్రతికినా శరీరంలోని ఏభాగమైనా దెబ్బతినవచ్చు.
అమ్మ దుఃఖానికి అంతేలేకుండాపోయింది.
నావెనుకే కొచెందూరం పరుగెత్తి, ఆపై పరుగెత్తలేక రొప్పుతూ నిల్చునే శివా రూపమే నాకళ్ళముందు కన్పించేది.నాపై ఎంత ప్రేమగా ఉండేవాడని?
నాకన్నుల్లో నీరు చిమ్మింది. నాన్న శివాను తీసుకొని మద్రాసు ఆసుపత్రికెళ్ళారు. అక్కడ కూడా అదేమాట చెప్పటం తో ఆపరేషన్ ఖాయమై పోయింది.
అమ్మ నన్ను పట్టుకొని భోరున ఏడ్చింది. ఆధుఃఖానికి చెలియలికట్టేది? విలవిల్లాడే మనసుతో మౌనంగా రోదిస్తున్న నాన్నను ఓదార్చేదెవ్వరు?
ఆపరేషనుకు ఇంక వారమేఉంది. మా ఆర్ధిక పరిస్తితు లు నాకంతగా తెలియవు గానీ డబ్బుకేమీ ఇబ్బంది లేదనే అనుకొంటాను.
**********************************************************************
      స్నానం చేసి వచ్చి అద్దం ముందు నిల్చున్న నేను ఉలిక్కిపడ్డాను. అందం మీద అంతగా శ్రద్ద లేని నేను ఎక్కవగా అద్దం చూసుకోను.డాక్టరుదగ్గరకు వెళ్ళి వచ్చినప్పటి నుండీ తరచూ చూసుకొంటున్నాను.నా పై పెదవి మీద నల్లగా నూనూగు వెంట్రుకలు రావటం గమనించాను.క్రిందిపెదవి నల్లగా మొరటుగా తయారయ్యింది.ముఖంలో లాలిత్యం అదృశ్యమై కరకుదనం ప్రవేశించింది.ఈ మార్పులన్నీ ఎప్పటినుంచో చోటు చేసి కొంటున్నా నేను గమనించనే లేదు. నేనప్పుడు గమనించలేదుగానీ చాలా రోజులనించీ మా యింట్లో అందరూ  నన్ను వింతగా చూస్తున్నారు.నేను నిశ్చలా సింధూలతో మునుపటికంటే చనువుగా ఉండే దాన్ని. ఒక రోజు సింధూ నాతో చెప్పలేక చెప్పలేక చెప్పింది
" మా మమ్మీ నీ తో తిరగొద్దని చెప్పిందే! ప్లీజ్,నన్ను అపార్ధం చేసుకోకు."
నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఈ అనుభవాలకు అర్ధాలు అప్పుడు నాకు స్ఫురించలేదు. ఇప్పుడు గుండె కోసుకు పోతూంది.
నిశ్చలతో నా కెదురైన అనుభవం నన్నింకా గుండె కోతకు గురి చేసింది.............

15, మార్చి 2010, సోమవారం

నేనెందుకిలా-------9


                   కొత్త పుస్తకాలు కొత్తక్లాసు రూము, అట్టలువేసుకోవటం అంతా బిజీ బిజీ గా గడచిపోయింది చాలా రోజులు.మా అందరిలో సింధుజ కొంచెం బొద్దుగా ఉంటుంది.దాని గుండెలు అప్పుడే బాగా ఎత్తుగా అయిపోయాయి. మాది కోఎడ్యుకేషన్ కాదు కాబట్టి సరిపోయింది.లేకపోతే మగపిల్లల కొంటె చూపులన్నీ దాని మీదనే ఉండేవి. ఆసంవత్సరం మధ్యలో అనుకొంటాను.సింధుజ పెద్దమనిషయ్యింది.వాళ్ళ ఇంట్లో వారు ఆ ఫంక్షన్ను చాలా గ్రాండు గా చేశారు.అప్పట్లో నాకా విషయాల మీద అంత అవగాహన లేదుగానీ ఇప్పుడనిపిస్తూంది,సింధుజ చాలా అదృష్ట వంతురాలని.అలా ఎందుకనుకొన్నానో నా జీవిత గాధ చదివిన తర్వాత మీకేఅర్ధమవుతుంది. కాలమనే చక్రానికి బాల్యం బాట అయితే సంతోషం కందెనలాంటిది.మూడు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో తెలియనేలేదు. ఈమూడు సంవత్సరాల్లో ముఖ్యమైన సంగతులు చాలానే జరిగాయి. నిశ్చలగూడా పెద్దమనిషయ్యింది.అది ఇప్పుడు చాలా అందంగా తయారయ్యింది.అందరు టెన్త్ క్లాసుకు వచ్చేశాము.దీపిక స్కూలు మానేసింది.
కాత్య నాన్నగారికిట్రాన్స్ఫరు వచ్చి వేరేవూరికి వెళ్ళిపోయారు.నిశ్చల తల్లి ని పిచ్చాసుపత్రిలో చేర్పించారు .ఇందుకు నిశ్చల పిన్ని గట్టిగా పట్టుబట్టిందట.పదవ తరగతి లోనే దానికి పెళ్ళిచేయాలని పట్టుబట్టిందట.ఆమె తమ్ముడు నిశ్చల కంటే పన్నెండేళ్ళు పెద్దవాడు.అతనికిచ్చిచేయాలని ఆమె పంతం.కానీ నిశ్చల గట్టిగానే ఎదురు తిరిగింది.
తల్లి విషయంలో మాత్రం నాన్న పిన్ని ఏకంకావటంతో ఏమీ చేయలేక పోయింది. నన్ను అమ్మ ఒకసారి లేడీడాక్టరు దగ్గరకు తీసికొని వెళ్ళింది.వాళ్ళు చేసేపరీక్షలన్నీ చూసి నాకు చచ్చేసిగ్గేసింది."నా ఆరోగ్యం బాగానే ఉందిగదా !ఇప్పుడెందుకివన్నీ?" అన్నాను.అమ్మ నావైపు  మౌనంగా చూసింది.డాక్టరు అమ్మకేదో చాలా సేపు చెప్పింది.
బయటకు వచ్చిన అమ్మ నన్ను కౌగలించుకొని కన్నీరు పెట్టుకొంది.ఎందుకలా ఏడ్చిందో నాకిప్పుడర్ధమయ్యిందిగానీ అప్పుడు తెలీలేదు.ఆసుపత్రి నుంచీ వస్తుంటే దూరంగా
మబ్బులు గుంపులు గుంపులుగా తూర్పు వైపునుంచీ పరుగెత్తుకొచ్చి మధ్యలో కమ్ముకోవటం ప్రారంభించాయి. గాలి చల్లగా ప్రారంభమయ్యి ,పెను తుఫానుగా మారసాగింది.మేము ఆటోలో ఇల్లు చేరుకొనేసరికి వాన కూడా మొదలయ్యింది.ఈ ఫోడుగాలిలో క్షణ క్షణాని కీ ఉద్రుతమౌతున్న వర్షంలో ,లోపల అమ్మ నాన్నతో ఏదో ఏడుస్తూ చెప్తూంది.కొన్నిమాటాలు నా చెవినగూడా పడ్డాయి. ఇప్పుడు నేనేమంత మరీ చిన్నదాన్ని కాదుగదా!ఆమాటలు నాకర్ధమయ్యేసరికి మెరుపులతో ఆకాశం  తగలబడుతున్నట్లు గా ఉంది. వరుసగా వందపిడుగులు  మా ఇంటి చుట్టూ పడ్డంత చప్పుడు. ఉన్నట్లుండి నాకు కళ్ళు తిరగసాగాయి.వరండాలో నాముందున్న కుర్చీని పట్టుకొని అలాగే కూలిపోయాను...........

2, మార్చి 2010, మంగళవారం

నేనెందుకిలా-------8

      

            నా గుండెల మీద ఏదో బరువుగా తగిలింది.ఎవరో స్టెతస్కోపు ఆన్చినట్టున్నారు.డాక్టరు కాబోలు. ఇంకా నేను బ్రతికే ఉన్నానో లేదో తేల్చటానికై ఉంటుంది.
        అతి కష్టంమీద కదలటానికి ప్రయత్నిస్తున్నాను.ఆశ్చ్ర్యకరంగా నాదేహంనాకు సహకరించటం లేదు.ఎంత ప్రయత్నించినా కొంచెంగూడా కదలలేక పోతున్నాను.
      అంటే నేను విగత జీవినౌతున్నానా? నాలో చైతన్యం మరణించిందా? కళ్ళు తెరవటానికినేను చేస్తున్న ప్రయత్నం వ్య్రర్ధమౌతూంది.కనుల సాయం లేకుండా చూడలేక పోతున్నాను. నోరుసాయంలేకుండా ఏమీ మాటాడ లేకపోతున్నాను.మరణమంటే ఇలాగుంటుందా?అయ్యో! మృత్యువు నన్ను కబళించేసి నట్టేఉంది.బయట అందరూ డాక్టరు పెదవి విరుపు కోసం ఎదురు చూస్తూంటారా? ఏమౌతూంది?  ప్రాణం పోవటం అంటే ఎలాఉటుంది-అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కజీవికీ ఉంటుంది.ప్రాణంపోయిన తర్వాత ఏమౌతుంది-అన్నప్రశ్నకు ఒక్కొక్కరు రకరకాల సమాధానాలు చెప్పారు.కానీ ఆ అద్భుతమైన అనుభవాన్నినేను స్వయంగా అనుభవించ బో తున్నానా? ఇప్పుడు నాపరిస్తితి నేనెవ్వరికైనా చెప్పగలనా?  ఆ అవకాశమే కన్పించటంలేదు.నా సర్వేంద్రియాలూ స్పృహను కోల్పోయాయి.శరీరంలోఏభాగమూ పని చెయ్యటంలేదు.మనసొక్కటే ఆలోచించగల్గుతూంది.అంతా అంధకారం.ఏమీకన్పించటం లేదు.సినిమాలలో చూపినట్టు ఇక్కడంతా ఏంజరుగుతూందో పైనుండీ చూడ లేక పోతున్నాను.చిమ్మచీకటి. కొంచెంగా చెవులు మటుకూ విన్పిస్తున్నాయి.అవికూడాఏక్షణాన్నయినా మూసుకొని పోవచ్చు.నాశరీరం స్పర్శను పూర్తిగా కోల్పోయినట్లేఉంది.ఈచిమ్మ చీకటిలో, ఈదుర్భర నిశ్శబ్ధంలో నేనెక్కడికి వెళ్తున్నాను.
                                        ఒక్కసారిగా డప్పులమోత ఆకాశాన్నంటింది.లీలగా ఏడుపుల మోత విన్పిస్తూంది. అంటే డాక్టరు పెదవి విరిచాడా?నేను మరణించానా? క్రమంగా ఈ ఆలోచించే మనసు కూడా మరణిస్తుందా? అలాగేఉంది.ఇప్పుడేమీ విన్పించటంకూడాలేదు.శరీరంతోనాకున్న బంధం పూర్తిగా తెగిపోయింది.ఈశరీరం నన్నెంత ఏడిపించిందని? నా బ్రతుకును నాశనంచేసిందిఈ శరీరమేగదా?నన్ను నలుగురిలో నగుబాట్లు చేసింది ఈశరీరమే గదా?ఈ దేహం జీవితకాలంలో నన్ను కాల్చుకు తినింది.ఎన్ని నొప్పులు,ఎన్ని రుగ్మతలు?ఎన్ని భాదలు?  కానీ ఈ శరీరం కొంత మంచిగూడా చేసింది.నాహావ భావాలను వ్యక్తీకరించగలిగాను.కానీ ఇప్పుడు?  నిశీధిలో కొట్టుమిట్టాడుతున్నాను.నేనెలాగున్నానో నేను చూసుకోలేను.వేరెవ్వరికీకన్పించను.పంచేంద్రియాలు పనిచేయటం మానేసి చాలా సేపయ్యింది. మనసు మటుకు ఆలోచించగల్గుతూంది.అదిగూడాఇంకెంత సేపు? ఇప్పుడు నన్ను
వేధిస్తున్న ప్రశ్న!మనసు,ఆత్మ ఒకటేనా? యుగపురుషులూ యోగసాధకులూ చెప్పిన ఆత్మ ఈ మనసేనా? మరి దీనికి చావులేదని చెప్పారే? ఇది క్రమక్రమంగా అస్తిత్వాన్ని కోల్పోతూంది. నా ఆలోచనల్లో వేగం తగ్గింది.
అంటే ఈమనసు ప్రకృతిలో లయించి పోతూందా !నిర్వీర్యమౌతున్న ఈ మనసుతో మళ్ళీ మెల్లగా ఆలోచనల్లో పడ్డాను.

*************************                                ********************                              **************                 

     వేసవి సెలవులిచ్చారు.అందరం పరీక్షలు బాగానేరాశాము. చివరి రోజు అందరం కల్సుకొని వీద్కోలు తీసికొన్నాము.సెలవుల్లో అప్పుడప్పుడూ కలవాలనుకొన్నాము.కానీ కుదరనే లేదు.మేము సెలవులుగడపటానికి మానానమ్మ గారి వూరెళ్ళాము.మానాన్న చిన్న తనమంతా అక్కడే గడిచింది.ఆవిషయాలన్నీ కధలు కధలుగా చెప్పేవాడు నాన్న.ఆఊరు చూస్తూంటే నాన్న చాలా అదృష్ట వంతుడనిపించింది.అంత చక్కని వాతావరణంలో పెరిగాడు కాబెట్టే నాన్న అంత ఆరోగ్యంగా కూల్ గా ఉంటారేమో.పచ్చటి పొలాల్లో తిరుగుతుంటే  హాయిగొల్పుతూ వీచే చల్లగాలులకు ఒళ్ళంతా పులకించేది..ఒక సంవత్సరానికి చాలా శక్తి వచ్చినట్లన్పించింది ఆఊర్లో.చూస్తూండగానే సెలవులయిపోయాయి.రిజల్టులు వచ్చాయనీ బయలుదేరి రమ్మనీ ఉత్తరం రాశాడు నాన్న. ఇక తప్పదన్నట్లు బయలుదేరాం అందరం.
                                         నేనూ ,మాఫ్రెండ్సందరం పాసయ్యాం.శివాకూడా పాసయ్యాడు.మధూ మటుకూ కొంచెం మొండికేసింది.నాన్న గారు వెళ్ళి క్లాసుటీచరు దగ్గర వచ్చేసంవత్సరం బాగా చదివిస్తానని హామీ ఇచ్చి పాసు చేయించుకొచ్చాడు.

23, ఫిబ్రవరి 2010, మంగళవారం

నేనెందుకిలా..........7

మనిషికి ఆరోగ్యం సరిగాలేనప్పుడు ప్రేమ కురిపించే మనసులు పైన వ్రాల్తాయంటారు.నిజమేనేమో అన్పించింది నాకు  శివాను చూస్తుంటే . వాడు నాకు బాగాలేనప్పటి నుండి నామంచం వదలనే లేదు.అన్నీ మంచం మీదికే సప్లయి చేసేవాడు.ఎప్పుడూ నాతొపోట్లాడే వీడికి నామీద ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్య పోయాను నేను..వాడు నా కాళ్ళవద్ద కూర్చొని కాళ్ళు పిసుకుతూ ఉంటేనా కన్నులు చెమర్చాయి ."చాలు శివా! నీవు వెళ్లి ఆడుకో పో !' అన్నాను.ప్రేమానురాగాలు ఇంత తియ్యగా ఉంటాయని ,వాటిని మనపై కురిపించే అమృత మనస్కులు మన చుట్టూ ఉన్నంత వరకు మనకు ఈ ప్రపంచం ఒక నందనో ధ్యానవనంలా  ,రంగులహరివిల్లులా కన్పిస్తుందని,అప్పుడే నేను తెలుసుకొన్నాను.
క్రమంగా కోలుకొన్న నేను రెండు రోజుల తర్వాతస్కూలుకు వెళ్ళగలిగాను. అక్కడ నిశ్చలను చూసిన నా మనసు ,మళ్లీ భారమయ్యింది .ఆరోజంతా క్లాసులతో బిజిగా ఉండి దాంతో మాట్లాడడమే కుదరలేదు .సాయంత్రం గేమ్సు టిచరు రాకపోవటంతోఅందరు ఎవరి పాటికి వాళ్ళు ఆడుకోసాగారు.నేను నిశ్చల దూరంగా పచ్చికలో కూర్చున్నాము .నేను  మవునంగా ఉన్నాను.
నిశ్చలే మొదలు పెట్టింది.
"ఆమె మా అమ్మ!"  తెలుసన్నట్లు  తల ఆడించాను.
"నీవు పుట్టినప్పటి నుండి మీ అమ్మ ఇలాగె ఉందా?"
"లేదు బృందా! నాకు ఆరేళ్ళు వయసు వచ్చే వరకు బాగానే ఉంది .నేనంటే ఎంత ప్రేమో అమ్మకు!. ప్రతి పండుగకు నాకు బట్టలుకొనేది.రోజు నాకు రకరకాల షోకులు చేసి నన్ను చూసికొని మురిసిపోయ్యేది.నేనేదడిగితే అది క్షణాల్లో అమర్చేది.లోకంలో అమ్మలందరూ ఎలాఉంటారో నాకు తెలీదు కానీ ఒక జీవితకాలానికి సరిపడా అమ్మప్రేమను ఆరేళ్ళకే నేను అమ్మవద్ద పొందగలిగాను.భగవంతుడికే కన్ను  కుట్టిందేమో ,అమ్మను అలాచేసాడు.
"మరి ఎలా?"
దాని ముఖం రక్త వర్ణం లోకి మారింది.  "మా నాన్న వల్లే...?"
నిర్ఘాంత పోవటం నా వంతయ్యింది.
"" అవును బృందా! ఆనందంగా సాగిపోతున్న మా కుటుంబం నాన్న చేసిన పనివల్ల చిన్నా భిన్నమయ్యింది.వాళ్ళ ఆఫీసులో టైపిస్టును పెళ్ళిచేసుకొని ఏకంగా ఇంటికి తీసుకొని వచ్చేశాడు నాన్న.విషయంతెల్సుకొన్న అమ్మ నివ్వెర పోయింది.నాన్ననూ ఆమెనూ అలాగే చూస్తూండి పోయింది చాలాసేపు. స్వతహాగా మా అమ్మ చాలా సాధు స్వభావు రాలు.అటువంటి అమ్మ ఆ రో జు అగ్ని పర్వతమే అయ్యింది.నాన్న నూ ఆమెనీ పట్టుకొని చేతులు నెప్పి పుట్టేవరకూ కొట్టింది.-ఏడ్చి ఏడ్చి, ఆమె శరీరంలోని రక్తమంతా నీరై పోయింది.   నీరసపడిపోయిన అమ్మ స్పృహ కోల్పోయింది.ఆదురదృష్టకరమైనరోజు నాకింకా బాగా గుర్తుంది.మాకుటుంబంలోని సంతోషాన్నీ,ఆనందాన్నీ నిర్ధాక్షిన్యంగా తనతో తీ సుకొని పోయిన రోజది.ఆరోజు తర్వాత మాయింట్లో నవ్వులు మాయమయ్యాయి.నాన్న కూడా సంతోషంగా ఉన్న క్షణాలు నాకు గుర్తులేవు.ఇలా ఎందుకుజరిగింది బృందా? తిరిగిలేచిన అమ్మ మామూలుగా లేదు.పిచ్చిచూపులు చూస్తూంది.ఎవ్వరినీ గుర్తించలేదు.నన్ను కూడా..."
 నిశ్చల మనసు చలించింది.కళ్ళలో నీళ్ళు చిమ్మాయి.కొంచెంసేపు మౌనంగా కూర్చుంది. తర్వాత చెప్పసాగింది...
 "పిన్ని నాన్నతో చెప్పింది.’నేను పెళ్ళి చేసుకొని వచ్చింది,సంతోషంగా ఉండడానికి.అంతేగానీపిచ్చివాళ్ళకు సేవలు చేయటానికి కాదు.ఆమె విషయం మీ రేంచేసుకొంటారో నాకు తెలీదు."అంటూ కుండ బ్రద్దలు కొట్టింది.అమ్మను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని చూశాడు నాన్న.కానీ నేనందుకు ఒప్పుకోలేదు.అమ్మను నేనే చూసుకొంటానని మాట ఇచ్చాను..........

నిశ్చల ఇంటికివెళ్ళి వచ్చిన తర్వాత నా ఆలోచనాపధంలో స్వచ్చమైన మార్పు వచ్చింది.నాకు తెలిసినజీవితం చాలా చిన్నది, సుఖమయమైనది.  కానీ ఇది శాశ్వతం కాదు.
ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విషాదం దాగి ఉంటుందేమో! అలాగేనా జీవితంలో కూడా విషాదం దాగి ఉందా?ఒకప్పుడు సంతోషంగా ఉన్న నిశ్చల ఈరోజు ఇంత విషాద భారాన్ని మోస్తూందంటే,ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖ ధుఖాలు కల్సి ఉంటాయా? నా జీవితంలోకూడానా?.....నా చిన్ని బుర్ర ఆలోచనలతో వేడెక్కి పోతూంది. కానీ ఒక్కటి మటుకూ స్పష్టమయ్యింది.--నేననుభవిస్తున్న ఈ సంతోషం,ఆనందం శాశ్వతం గాదు.ఒక పెను విషాదం పొంచిఉంది.
అది ఏ రూపంలో నాపై దాడి చేస్తుందో తెలీదు.  మరికొద్ది రోజుల తర్వాతగానీ నా ఆలోచనలకుఒక రూపం రాలేదు.జీవితంలోని మరోకోణాన్ని నేను సింధుజా వాళ్ళింట్లో చూడగలిగాను....కొద్ది రోజుల తర్వాత .

10, ఫిబ్రవరి 2010, బుధవారం

నేనెందుకిలా .......6


చెరొక స్కేలు పట్టుకొని శివా ఒకప్రక్క మధూ మరోప్రక్కా నాకోసం ఎదురు చూస్తూ నిల్చుని ఉన్నారు. "మా ముసుగులు లాగేసి, మానిద్ర పాడు చేస్తావుటే!ఈరోజు నీ పని అయి పోయింది." అంటూ నామీదకు లంఘించాడుశివా.
నేను ఒక్క ఎగురు ఎగిరి వాడిని ప్రక్కకు తోసేసి పరుగుతీశాను తోటలోకి.వాడు కొంతదూరం పరుగెత్తి రొప్పుతూ నిల్చిపోయాడు.కానీ మధూ నావెంట పడింది.అది నాకంటే వేగంగా పరుగెత్త గలదు.నేను వెళ్ళినాన్నగారి కుర్చీవెనుక నిల్చున్నాను."ఏమిటేమీ గోల,మధూ ఊరుకో"" అంటూ నాన్నగారు పరిస్తితులను అదుపులోకి తెచ్చారు.
త్వర త్వరగా తయారయ్యి బయలుదేరాను.నాన్న గారు స్కూటరులోనన్ను తీసికెళ్ళి నిశ్చల యింటి వద్ద వదిలాడు.నిశ్చల పరుగునవచ్చి నన్ను రిసీవ్ చేసుకొంది.
సాయంత్రం వస్తానని చెప్పి నాన్న వెళ్ళిపోయాడు. నిశ్చల ఇంకా స్నానం చేసినట్టులేదు.తలకూడా దువ్వినట్టు లేదు.జుట్టంతా వెనక్కు లాగి రిబ్బన్తో గట్టిగాకట్టివేసింది.ఒక పెద్ద యింటిలో ఔట్ హవుసులో అద్దెకుంటున్నారు వారు.
నన్ను ఇంటి వెనక్కు తీసికెళ్ళింది.అది చిన్న పోర్శన్.ఇంటి ముందు చిన్న బాదంచెట్టుంది.మేము లోపలికి వెళ్ళాము.లోపల వంటిల్లు కాక రెండు గదులున్నట్లున్నాయి.నన్ను హాలులో కూర్చోబెట్టి లోనికెళ్ళింది నిశ్చల.
ఇల్లంతా నిశ్శబ్ధంగా ఉందేమిటి చెప్మా అనుకొంటూ కూర్చున్నాను. నిశ్శబ్ధంలోంచీ నాకేదో అపశ్రుతి విన్పిస్తూంది. కొంత సేపు తర్వాత నిశ్చల ఒక కప్పులోపాలు తీసికొని వచ్చి నా చేతికిచ్చింది.
"అమ్మా నాన్నా లేరా" అడిగాను. "నాన్నగారు బయటకు వెళ్ళారు.అమ్మ లోపలుంది" నేను పాలు త్రాగేవరకూ నిల్చుని లోపలకు రమ్మని పిల్చింది.నన్ను ముందు వంట గదిలోకి తీసికెళ్ళింది.అటు తిరిగి వంట చేస్తున్న ఆమెను చూపి "మా పిన్ని" చెప్పింది.ఆమె తలత్రిప్పి నావైపు చూసి మళ్ళీ అటు తిరిగింది.చిన్న చిరునవ్వు కూడా లేదు.లేకపోగా ముఖంలో కౄరత్వం కొట్టొచ్చినట్టు కన్పిస్తూంది.నాకెందుకో ఆమె నచ్చలేదు.
"అమ్మ?" అడిగాను, నిశ్చలవైపు తిరిగి.ఇంతలో ఒక పెద్దకేక విన్పించింది.ఒకసారికాదు.అలా కేకలు విన్పిస్తూనేఉన్నాయి.నిశ్చల నన్ను గట్టిగా పట్టుకొని "బృందా! నీవు హాల్లో కూర్చో!నేనిప్పుడేవస్తాను.నాతోరాకు--"
గబ గబా నాతో చెప్పేసి పక్కరూములోకి పరిగెత్తింది.’పిన్నితలకూడా తిప్పకుండా వంట చేసుకొంటూ, కను కొలుకుల్లోంచీ నావైపు చూసింది. నేను హాలు వైపు నడుస్తూ,చిన్నతనంలో ఉండే కుతూహలంకొద్దీ, పక్కరూములోకి తొంగి చూశాను.అంతే! నిశ్చేష్టురాలినై నిల్చుండి పోయాను.నాకళ్ళు పెద్దవయ్యాయి.ఒళ్ళంతా చెమటలు పట్టేసింది.నా శరీరంపై నాకే పట్టు తప్పి, లోపలికి అలా చూస్తూండి పోయాను.--
************* ******** ***********
ఆమె నిశ్చల తల్లి అనుకొంటాను.కళ్ళు పెద్దవి చేసి నాలుక బయటకు వ్రేలాడ దీసి పెద్దగా రొప్పుతూంది.రెండు చేతులూ వెనక్కు విరిచి చైనుతో కట్టేసి ఉన్నాయి.జడ ఊడిపోయి జుట్టంతా ముఖం మీద పడుతూంది.చైను లాగుతూ చేతులు గుంజుకొంటూంది.నిశ్చల ఆమెను గట్టిగా పట్టుకొని చెవి దగ్గర "అమ్మా!అమ్మా!" అని పిలుస్తూంది. పిలుపుకి ఆమె కొద్దిగా స్పందిస్తూంది.
ఆమె రెండు బుగ్గలనూ చేతితో పట్టుకొని "అమ్మా! ఏం కావాలి?" అని అడుగుతూంది నిశ్చల.ఈనిశ్చల నాకు ప్రాణ స్నేహితురాలు నిశ్చలగా కాక ఒక మాతృమూర్తిలా ,ఆకాశ మంత ఎత్తుకు ఎదిగిన ఒక స్త్రీ మూర్తిలా కన్పించింది నాకళ్ళకు.ఆమె గుడ్లు త్రిప్పుతూ ప్రక్కనున్ననీటి బిందె వైపు చూపించింది.నిశ్చల బిందెలో నీరు గ్లాసుతో ఆమెకు త్రాగించింది.అవి త్రాగి ఆమె అలాగే మంచంపై వాలి కళ్ళు మూసుకొంది. నెమ్మదిగా వెనక్కు తిరిగిన నిశ్చల గుమ్మంలో నన్ను చూసి నిర్ఘాంత పోయింది.ఇంకా విభ్రాంతిలో ఉన్న నన్ను చేయి పట్టుకొని హాలులోకి నడిపించింది."అమ్మకు బాగాలేదు" అని మాత్రం చెప్పింది.ఇంకేమైనా మాటాడితే పిన్ని వింటుందని భయమేమో!

ఎలాగో సాయంత్రం వరకు గడిపి ఇంటికి వచ్చేశాను.ఇంట్లో ఎవ్వరికీ సంగతులేవీ చెప్పలేదు. రాత్రి కలలో నిశ్చల తల్లి ముఖమే కన్పిస్తూంది.పొద్దున లేచేసరికి ఒళ్ళు కాలి పోతూంది.అమ్మా,నాన్నా,చాలా ఆదుర్దా పడ్డారు. జ్వరం మూడు రోజులు తగ్గలేదు.సర్కసులో పులిని చూసికూడానేనంత భయ పడలేదు. నాకు జ్వరమని తెలిసి నిశ్చ్లల అర్ధం చేసికొంది.ఒక రోజు ఇంటికి వచ్చి "సారీ,బృందా!
నిన్ను మా యింటికి పిలవకుండా ఉండాల్సింది." అంది.నేను చేతులతో దాని నోరు మూశాను ,అలా అనవద్దన్నట్టు..అదీగాక విషయమేమిటో నేను మాయింట్లో ఎవ్వరికీ చెప్పలేదు.....

7, ఫిబ్రవరి 2010, ఆదివారం

నేనెందుకిలా...........5


ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు.వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి.
ఎవరో అత్యుత్సాహంగా నేనింకా బ్రతికిఉండగానే టపాకాయలు కాల్చటం మొదలు పెట్టేశారు.ఇంకెవరో వారిని మందలిస్తున్నారు,కొంచెంసేపు ఆగమని.నెమ్మదిగా కన్నులు తెరవటానికి ప్రయత్నిస్తున్నాను.గుడ్లు కదులు తున్నాయి.కానీ కనురెప్పలు తెరిపి పడ్డం లేదు.ఇప్పుడు కన్నులు తెరిచి నేనింకా బ్రతికే ఉన్నానని నిరూపించుకోవాలి.అది చాలా అవసరం.లేకుంటే నేను బ్రతికుండగానే స్మశానానికి తరలించేట్టు ఉన్నారు.నా గత స్మ్రుతులను పూర్తిగా నెమరువేసుకొనేవరకూ నేను బ్రతికే ఉండాలి.ఆమధుర ఙాపకాలతొ నా మనసు నిండి పోవాలి.నిండుగా ఉన్న గుండెలతో నేను స్మశానానికి చేరుకోవాలి.పునర్జన్మలమీద నాకు అవగాహన లేదు.కానీ మరో జన్మంటూ ఉంటే నేను బృందగా, నిశ్చల నా స్నేహితురాలిగా మళ్ళీ పుట్టాలి.ఇది నా కోరిక.
అంతేగానీ, డొల్లగా ఉన్న మనసుతో వల్లకాటికి పోవటానికి నేను సిద్దంగా లేను.అతి కష్టం మీద నా కళ్ళు తెరిపిడి పడ్డాయి.నాప్రక్కనెవరో "కళ్ళు తెరిచింది! ఇంకా బ్రతికేఉంది" అంటూ అరిచారు.
విషయం అంచెలంచెలుగా అందరికీ చేరిపోయింది---ఏడుపులాగి పోయాయి.మాటలు నిల్చి పోయాయి.అంతా నిశ్శబ్ధం.---కొందరు లేచి ఇళ్ళకు పోవటానికి ప్రయాణమయ్యారు.
మరి కొందరు టీ త్రాగి రావటానికి బయలు దేరారు.పైకి ఎవ్వరూ చెప్పటం లేదుగానీ " ఇంకా ఎంతసేపు ఇలా--" అన్న అర్ధాన్ని స్ఫురింపజేస్తూందీ నిశ్శబ్ధం.

ఎలాగైతేనేం, నా ప్రయాణాన్ని కొంతసేపు వాయిదా వేయగలిగాను.నా ప్రమేయం లేకుండానే మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి.ఆలోచనలు ఆదివారాన్ని చేరుకొన్నాయి.

*******************************************************************************
" బృందా, త్వరగా లే!నిశ్చలా వాళ్ళింటికి వెళ్తానన్నావుగా,నాన్నగారు వదలి వస్తారు!లేచి స్నానంచేసి త్వరగా తయారవ్వు".అమ్మ మేలుకొలుపుతో ఒక్క ఉదుటున మంచంమీదనుండీ
లేచాను.ఒకప్రక్క శివా ,మరోప్రక్క మధూ(చెల్లి పేరు మధుమతి) ముసుగులు తన్ని పడుకొని ఉన్నారు.వారిద్దరి ముసుగులూ లాగేసి బాత్రూంలో దూరి తలుపేసుకొన్నాను.అక్కడేఉంటే ఇద్దరూ
కల్సి నన్ను ఉతికేస్తారని భయం.నేను అల్లరి చేసినప్పుడెల్లా శివా నన్ను కొడుతూంటాడు.ఆడపిల్లలను కొట్టగూడదురా అంటే--కొట్టడానికి ఆడేమిటి మగేమిటి, ఎవ్వరైనా ఒకటే,అంటూ ఇంకా ఎక్కువ చేస్తాడు.నా జిత్తులు వాడి దగ్గర సాగవు.’గంభీరంగా తింటూ బాగా లావయ్యాడు.అందుకేఅంత పొగరు-అనేసి పరిగెత్తేదాన్ని.నేను సన్నగా రివటలా ఉంటానేమో వేగంగా పరుగెత్తేదాని. వాడంత వేగంగా పరుగెత్తలేడు.అందుకే నిల్చుని గుర్రుగా చూసేవాడు.
గబ గబా స్నానం చేసి బయటకు వచ్చాను.కూని రాగం తీసు కొంటూ బయటకు వచ్చిన నేను తలెత్తి చూసి భయంతో కళ్ళు పెద్దవి చేశాను."అమ్మాఅన్న కేక నా నోటి నుండీ అప్రయత్నంగావెలువడింది.

25, జనవరి 2010, సోమవారం

చెల్లి

విధి వ్రాశిన వ్రాతలు మార్చి
మలి వ్రాతలు వ్రాయలేరెవరూ!

చిన్ని చెల్లి కన్నెపిల్లగా మారి
కాళ్ళపారాణి ఆరకముందే
కట్టుకొన్న భర్తతో కలిసి
ఎర్రని బుగ్గలతో,వాలేకన్నులతో
చెప్పినవారికేచెప్పి మరిమరీచెప్పి
ఏడుకొండల వాడిని చూడబోతే
పాడుకారు బండ గుద్ది
మాంసపు ముద్దగామారె!

విధివ్రాశిన వ్రాతలు మార్చి
మలివ్రాతలు వ్రాయలేరెవరూ!

కలలు కంటూ ఇలను విడిచి
అన్నకు చేసిన బాసలు మరచి
నన్ను దిగ్భ్రాంతుడిని చేసి
వెళ్ళిపోయింది చెల్లి మాయచేసి
మరలి రాని లోకాలకు
నన్నొంటరిని చేసి!

విధివ్రాశిన వ్రాతలు మార్చి
మలివ్రాతలు వ్రాయలేరెవరూ!

23, జనవరి 2010, శనివారం

నేర్పించకు-------


నేర్పించకు నీ బిడ్డకు
నైరస్యతను నిస్తేజమును
పనికిరాని జ్ఞానాన్ని
బడి లోపలి చదువులను!

భోదించకు నీ బిడ్డకు
భావియన్నది శూన్యమని,
లోకమంటే కాకులని,
లోకమంతా పాపులని,
మంచియన్నది లేనేలేదని,
నేర్పించకు నీ బిడ్డకు !!!!

19, జనవరి 2010, మంగళవారం

ఉషస్సుతెల్లవారిన వేళలో
వెల్లి విరిసిన ఉషస్సులో
కళ్లు తెరిచి చూశాను
తెల్ల బోయి నవ్వాను !

కన్నుల ముందు నిలు చుంది
నన్ను సమ్మోహన పరిచే రూపం
ప్రాతహ్కన్య పసందుగా
కన్నుల విందును చేసిన దృశ్యం!

అల్ల నల్లన నడిచి
మెల్లగా నన్ను చేరి
కళ్ళ తోనే ప్రశ్నించింది
'కుశలమా ప్రియా' అని!

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు జాబితా

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    9 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!